రామగిరి(నల్లగొండ) : నల్లగొండ కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 8 సీట్లు, 8వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్
నల్లగొండ : ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజావాణిలో అందిన వినతులను నిర్లక్ష్యం చేయకుండా నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు 89 వచ్చాయని, వాటిలో రెవెన్యూ శాఖకు 29, ఇతర శాఖలకు సంబందించినవి 60 వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల పాలకవర్గాల ప్రమాణ స్వీకారం
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాల నూతన పాలకవర్గాలు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పచ్చల సోమేశ్వరాలయం చైర్మన్‌గా గజ్జి సురేష్‌యాదవ్ ధర్మకర్తలుగా జంపాల శంకర్, కొండ అంజయ్య, కొడదల వెంకన్న, ఊసం సక్కుబాయి, వేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌గా ఓర్సు రమేష్, గుడిసె రాంబాబు, గజ్జి రాజు, రుద్రాక్షి మంగమ్మ, ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్‌గా కొప్పు సత్తయ్యగౌడ్, ధర్మకర్తలుగా గుండెగోని సురేష్‌గౌడ్, తుల్మ శశికిరణ్, చాపల ప్రవీణ్, చిలుముల అశోక్ ప్రమాణ స్వీకారం చేశారు. పచ్చల సోమేశ్వరాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి పాల్గొని నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఒకటో డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట్ల నాగరాజు, ఆలయాల అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


