నల్లగొండ : అధికారులు ఈ వారం అంతా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు, సెన్సస్, సాదాబైనామా, ఎస్‌ఐఆర్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాల పురోగతిపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఎస్‌ఓలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. రోజూ 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అన్‌లోడింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. లారీలు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కొన్ని సెంటర్లు మూతపడిన నేపథ్యంలో అక్కడి వనరులను ఇతర కేంద్రాల్లో వినియోగించాలని ఆదేశించారు. జనగణనకు సంబంధించి జూన్ 9 నాటికి 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పనులపై బీఎల్‌ఓలతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి 100 శాతం పూర్తిచేసేలా చూడాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపడుతున్న పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. లేబర్ రిపోర్టులు త్వరగా నమోదు చేయాలని, అర్హులైన వారికి జాబ్ కార్డులు వెంటనే జారీ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, పౌరసరఫరాల డీఎం రాంపతి నాయక్, సీపీఓ శ్రీనివాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అడవుల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ
నల్లగొండ : అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ భూముల్లోనే కాకుండా ప్రైవేట్ భూముల్లో కూడా ఉన్న అటవీ ప్రాంతాలను గుర్తించి వాటిని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రకృతి సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అటవీ ప్రాంతాల గుర్తింపులో రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రామాల వారీగా సర్వే నిర్వహించి చెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఏడీఎస్‌ఎల్‌ఆర్ రాజశేఖర్, జిల్లా ఫారెస్ట్ అధికారి వై.శ్రీనివాస్, ఫారెస్ట్ అధికారులు వి.చంద్రమోహన్, వీరేంద్రబాబు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


