మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలో గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో (వైటీపీఎస్) ఆదివారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సోమవారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై సమీక్షించారు. ప్లాంట్‌లోని కంట్రోల్ రూమ్‌కు వెళ్లి ప్రమాదం జరిగిన సమయానికి సంబంధించిన సీసీ టీవీ విజువల్స్‌ను చూశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ యూనిట్–3 పరిధిలోని టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీక్ కావడం వల్లే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ ప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్, కొన్ని కీలకమైన వాల్వ్‌లు దెబ్బతిన్నాయని, అత్యంత విలువైన ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం ఊరట కలిగించే విషయమన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి సాంకేతిక లోపాలు పనురావృతం కాకుండా ముందస్తు భద్రత చర్యలు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్లాంట్‌ను పునరుద్ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ప్లాంట్ చీఫ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విద్యుత్ కేంద్రం ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


