బంద్ ప్రశాంతం
నకిరేకల్‌లో జాతీయ రహదారిపై టైర్లు వేసి దహనం చేస్తున్న బీసీ సంఘాల నాయకులు
నల్లగొండ : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. బీసీ సంఘాలన్నీ ఏకమై కదం తొక్కాయి. వీటికి అధికార కాంగ్రెస్‌తో సహా అఖిలపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇతర కులసంఘాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు సైతం బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. బంద్ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ముందుగానే సెలవును ప్రకటించాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ బంద్ ప్రభావం కనిపించింది. అఖిలపక్ష పార్టీలు, సంఘాల నాయకులు జిల్లాకేంద్రంలో ర్యాలీలు చేపడుతూ విద్యాసంస్థలు, ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు, వర్తక వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసి వేయించారు. దీంతో జిల్లాలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. బంద్ సందర్భంగా ఆయా చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తదితర రాజకీయ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు.
రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు
బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా నిలిచిన సంఘాలు, అఖిల పార్టీల నాయకులు శనివారం తెల్లవారుజామున 4 గంటలకే జిల్లాలోని ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించారు. బస్సులు డిపో నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. అక్కడక్కడ ఆటోలు నడిచాయి. మధ్యాహ్నం తరువాత బస్సులు రాకపోకలు ప్రారంభం కాగా, వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. ఈనెల 20వ తేదీన దీపావళి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రజలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనదారులు ఇష్టానుసారంగా చార్జీలను వసూలు చేసినట్లు తెలిసింది.
ప్రధాన పట్టణాలు బంద్ ఇలా..
● నల్లగొండలో బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. ఉదయం 4 గంటల నుంచే బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు బైఠాయించారు. వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. హైదరాబాద్ రోడ్డులో ఓ కారు షోరూమ్ తెరిచి ఉండటంతో బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్విన సంఘటన మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.
● నకిరేకల్‌లో బీసీ సంఘాలు, పార్టీల నాయకులు 65వ నెంబర్ జాతీయ రహదారిపై పద్మానగర్ జంక్షన్ వద్ద అరగంట పాటు రాస్తారోకో చేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. టైర్లు రోడ్లపై వేసి మంటలు పెట్టి నిరసన తెలిపారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
● బంద్ సందర్భంగా బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో బంద్ విజయవంతమైంది. ఆయా సంఘాలు, పార్టీలు ఆధ్వర్యంలో పట్టణంలో వేర్వురుగా ఆందోళనలు, ర్యాలీలు సాగాయి.
● దేవరకొండలో బీసీ సంఘాలు, పార్టీల నాయకులు బస్ డిపో ఎదుట బైఠాయించారు. బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
● సాగర్ నియోజక వర్గంలోని హాలియా, నిడమనూరు, పెద్దవూర, నాగార్జునసాగర్ అంతటా బంద్ ప్రశాంతంగా జరిగింది. హాలియాలో నాయకులు రోడ్డుపై వంటావర్పు నిర్వహించారు.
● మునుగోడు నియోజక వర్గంలో ప్రశాంతంగా సాగింది. వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి. బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు పలుకడంతో విజయవంతమైంది.
నకిరేకల్‌లో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం
మిర్యాలగూడలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు, పాల్గొన్న ఎమ్మెల్యే
నిర్మానుష్యంగా కనిపిస్తున్న నల్లగొండ బస్టాండ్
ఫ జిల్లావ్యాప్తంగా కదం తొక్కిన
బీసీ సంఘాలు
ఫ కలిసొచ్చిన ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు
ఫ రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు,
మూతపడిన వ్యాపార సంస్థలు
బంద్ ప్రశాంతం
బంద్ ప్రశాంతం
బంద్ ప్రశాంతం


