అక్రమ దత్తత నుంచి శిశువులకు విముక్తి
నల్లగొండ: ఇద్దరు శిశువులను అక్రమంగా దత్తత తీసుకున్న వారి నుంచి పోలీసులు విడిపించి శిశుగృహకు తరలించారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి(సాగర్) మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన కుర్ర బాబుకు 11 ఏళ్ల క్రితం పార్వతితో వివాహమైంది. వీరు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని బీటీఎస్‌లో నివాసముంటున్నారు. బాబు కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బాబు, పార్వతి దంపతులకు మొదట కుమారుడు పుట్టి చనిపోగా.. ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అందులో ఒక పాప 2సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. 15 రోజుల క్రితం హాలియాలోని నిర్మలా ఆస్పత్రిలో పార్వతి మళ్లీ ఆడపిల్లకు జన్మించింది. కాగా.. ఆడపిల్లను పెంచి పోషించడం తనకు భారమవుతుందని అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న శాంతిప్రియ అనే డాక్టర్‌కు బాబు చెప్పాడు. దీంతో డాక్టర్ శాంతిప్రియ ఆ పాపను దత్తత ఇప్పించేందుకు తనకు తెలిసిన ఏపీలోని ఏలూరుకు చెందిన సాంబమూర్తి, రజిత దంపతులకు చెప్పింది. సాంబమూర్తి, రజిత దంపతులు ఈ నెల 25న నల్లగొండకు వచ్చి సాయంత్రం 7గంటల సమయంలో నల్లగొండ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో బాబు, పార్వతి దంపతుల నుంచి రూ.2.30లక్షలకు పాపను దత్తత తీసుకుంటామని ఒప్పందం చేసుకుని రూ.10వేలు ఇచ్చారు. పాప హెల్త్ చెకప్ చేసిన తర్వాత లీగల్ ప్రాసెస్ పూర్తిచేసి మిగతా డబ్బులు ఇస్తామనే ఒప్పందంతో పాపను సాంబమూర్తి దంపతులు తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరస్వతి నల్ల గొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు డాక్టర్ శాంతిప్రియను మంగళవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చేసి హాలియాలోని నిర్మల ఆస్పత్రిలో డాక్టర్‌గా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. డాక్టర్ శాంతిప్రియ తమ బంధువు సరస్వతి ద్వారా ఏపీలోని ఏలూరుకు చెందిన సాంబమూర్తి దంపతులు పిల్లలను దత్తత తీసుకోవాలని చూస్తున్నారని తెలుసకుందని, కుర్ర బాబు దంపతులు కూడా తమకు పుట్టిన పాపను విక్రయిస్తామనడంతో సాంబమూర్తి దంపతులకు శాంతిప్రియ సమాచారం ఇచ్చిందని ఎస్పీ వివరించారు. ఈ కేసులో కుర్ర బాబుతో పాటు సాంబమూర్తి, ఆయన భార్య రజిత, డాక్టర్ శాంతిప్రియను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
21 రోజుల బాబును అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన ఓర్సు శ్రీను, సుజాత దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. భార్య సుజాత, పిల్లలకు దూరంగా ఉంటున్న ఓర్సు శ్రీను ఆరేళ్ల క్రితం మట్టి పని కోసం ఒరిస్సాకు వెళ్లి అక్కడ జంకర్‌మాల అలియాస్ మమతను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప పుట్టింది. మమత రెండోసారి గర్భవతి కాగా.. రెండు నెలల క్రితం ఆమెతో కలిసి ఓర్సు శ్రీను స్వగ్రామానికి వచ్చాడు. అయితే కోనాయిగూడేనికే చెందిన వేముల నాగరాజు, సువర్ణను తమ దూరపు బంధువైన కనగల్ మండలం బోయినపల్లికి చెందిన శ్రీను రెండు నెలల క్రితం కలిసి పిల్లలు విక్రయించేవారుంటే చెప్పాలని కోరాడు. ఈ విషయాన్ని నాగరాజు, సువర్ణ కలిసి ఓర్సు శ్రీను, మమత దంపతులకు చెప్పారు. దీంతో ఓర్సు శ్రీను, మమత దంపతులు తమకు పుట్టబోయే బిడ్డను విక్రయించి తిరిగి ఒరిస్సా వెళ్లాలని నిర్ణయించుకుని అందుకు ఒప్పుకున్నారు. ఈ నెల 8న మమత మగ బిడ్డకు జన్మినిచ్చింది. పుట్టిన బిడ్డను విక్రయించాలని నిర్ణయించుకున్న ఓర్సు శ్రీను, మమత దంపతులు వేముల నాగరాజు, సువర్ణకు విషయం చెప్పారు. రూ.6లక్షలకు శిశువును విక్రయిస్తామని చెప్పడంతో మధ్యవర్తి అయిన శ్రీను, నాగరాజు, సువర్ణ ఈ నెల 10న ఈ నెల 10న రూ.4.50లక్షలకు ఒప్పందం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. ఈ నెల 15న డబ్బులు చెల్లించి బాబును తీసుకెళ్లారు. ఈ ఘటనపై కూడా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి మధ్యవర్తి శ్రీనుతో పాటు బాబును కొన్న వేముల నాగరాజు, సువర్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, బాలుడి తండ్రి ఓర్సు శ్రీను, మమత పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. పై రెండు కేసుల్లో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, శిశువులను శిశుగృహకు అప్పగించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి, ఐసీడీఎస్ పీడీ నిర్మల, సీఐలు రాజశేఖర్‌రెడ్డి, రాఘవరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
మరో కేసులో ముగ్గురి అరెస్టు
శిశుగృహకు అప్పగించిన పోలీసులు
ఏడుగురి అరెస్టు
వివరాలు వెల్లడించిన నల్లగొండ
ఎస్పీ శరత్‌చంద్ర పవార్


