ప్రేమ పెళ్లి చేసుకున్న పన్నెండు రోజులకే..
గుర్రంపోడు: వారిద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పన్నెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. కానీ కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన శిలువేరు నవీన్ నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష(20) ప్రేమించుకున్నారు. మొదట్లో అనూష తల్లిదండ్రులు వారి ప్రేమకు అంగీకరించకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఈ నెల 17న గ్రామంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకన్నారు. నవీన్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. నవీన్, అనూష కలిసి బుధవారం బైక్‌పై గుర్రంపోడుకు వస్తున్నారు. అదే సమయంలో గుర్రంపోడు గ్రామానికి చెందిన రేపాక లచ్చయ్య బైక్‌పై తన పిల్లలకు తీసుకుని గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద వాగు ప్రవాహాన్ని చూపించి మళ్లీ గుర్రంపోడు వైపు వెళ్లేందుకు బైక్‌ను తిప్పుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న నవీన్ సడన్ బ్రేక్ వేస్తూ లచ్చయ్య బైక్‌ను ఢీకొట్టి నల్లగొండ– దేవరకొండ రహదారిపై ఎడుమ వైపునకు పడిపోయాడు. బైక్‌పై వెనుక కూర్చున్న అనూష ఎగిరి బ్రిడ్జి రెయిలింగ్‌పై నుంచి వాగులోకి పడిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు ఎవరో వాగులో పడినట్లు గుర్తించి వాగులోకి వెళ్లి వెతకడం ప్రారంభించారు. అర్ధగంట తర్వాత వాగు ప్రవాహం అంచున గుంతలో అనూష మృతదేహం లభ్యమైంది. తలకు తీవ్ర గాయమైన నవీన్‌ను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి
భర్తకు తీవ్ర గాయాలు


