నదిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
మేళ్లచెరువు: చేపల వేటకు వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకున్న వ్యక్తిని బుధవారం పోలీసులు కాపాడారు. మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీరా మనగర్ కాలనీకి చెందిన పరసగాని శ్రీను మంగళవారం తెల్లవారుజామున చింతలపాలెం మండలం పాతవెల్లటూరు గ్రామ పరిధిలోని కృష్ణా నదిలోకి పడవలో చేపల వేటకు వెళ్లాడు. వేట మధ్యలో వర్షం పడుతుండగా పడవ ఇంజన్ రిపేరు వచ్చింది. దీంతో పడవను ఒడ్డుకు చేర్చడం కష్టంగా మారింది. ఎలాగో అలా అతడు నది ఒడ్డుకు వెళ్లి రాత్రంతా వర్షంలో బిక్కుబిక్కమంటూ ఉన్నాడు. బుధవారం ఉదయం శ్రీనుకు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. ఎటు వెళ్లాలో దారి తెలియక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ పోలీసులకు సమాచరం అందించగా.. వారు శ్రీను చిక్కున్న ప్రదేశానికి వెళ్లి అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స చేయించి ఇంటికి పంపించారు.


