ఆగ్రహించిన పత్తి రైతు
శాలిగౌరారం: సీసీఐ కేంద్రానికి వచ్చిన పత్తిని కొనుగోలు చేయకుండా నిలిపివేడంపై పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ అధికారుల వైఖరిని నిరసిస్తూ శాలిగౌరారం మండలంలోని మాధారంకలాన్ గ్రామపంచాయతీ పరిధిలో టీఆర్‌ఆర్ కాటన్‌మిల్లు ఎదుట జాతీయ రహదారిపై రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి బస్తాలను జాతీయ రహదారిపై వేసి నిప్పుపెట్టి నిరసన తెలిపారు. సీసీఐ అధికారుల వైఖరిని నిరసిస్తూ రైతులు నినాదాలు చేశారు. సుమారు రెండు గంటలపాటు రైతులు రాస్తారోకో చేయడంతో ఇరువైపుల సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సీసీఐ కేంద్రం ప్రారంభం కావడంతో స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తిని కేంద్రానికి తీసుకొచ్చామని.. తేమశాతం అధికంగా ఉందన్న పేరుతో సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదన్నారు. తుపాన్ ప్రభావానికి ఎండిన పత్తిలో సైతం తేమశాతం పెరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు వచ్చి పత్తి కొనుగోలు చేస్తామని హామీ ఇస్తేనే రాస్తారోకోను విరమిస్తామని తేల్చిచెప్పారు. విషయం తెలుసుకున్న మండల అధికారులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు ససేమిరా అనడంతో విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, తహసీల్దార్ వరప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి చీనానాయక్ రైతుల వద్దకు చేరుకొని మాట్లాడారు. ఈ క్రమంలో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా ఉన్నతాధికారులు.. సీసీఐ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం పత్తి విక్రయానికి 22 ట్రాక్టర్లు రాగా అందులో 11 ట్రాక్టర్ల పత్తిని బుధవారం, మరో 11 ట్రాక్టర్ల పత్తిని గురువారం కొనుగోలు చేసేలా సీసీఐ అధికారులతో మాట్లాడారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు. ప్రస్తుతం కేంద్రానికి వచ్చిన 22 ట్రాక్టర్ల మినహా.. తుపాన్ ప్రభావంతో పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు సీసీఐ అధికారులు ప్రకటించారు. తుపాన్ ప్రభావం తగ్గిన తర్వాత పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ సీపీఓ రవీందర్ తెలిపారు. కార్యక్రమంలో మధారంకలాన్, వంగమర్తి, పెర్కకొండారం, చిత్తలూరు, వల్లాల గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఫ కొనుగోలుకు కొర్రీలు పెడుతున్నారని ఆవేదన
ఫ జాతీయ రహదారిపై
పత్తికి నిప్పుపెట్టి నిరసన


