కేంద్రాలకు ఒకేసారి ధాన్యం తేవొద్దు
నల్లగొండ : రైతులు కొనుగోలు కేంద్రాలకు ఒకేసారి ధాన్యం తేవొద్దని.. విడతల వారీగా ధాన్యం తెచ్చేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ధాన్యం సేకరణపై శనివారం వివిధ శాఖల అధికారులు, మిల్లర్లతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లులకు రైతులు ఒకేసారి ధాన్యం తీసుకురావడం వల్ల ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వరి కోతల ఆధారంగా ఒక షెడ్యూల్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఒకేసారి వరి కోతలు జరగకుండా ఇదివరకే డివిజన్ల వారిగా హార్వెస్టర్లతో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. మిర్యాలగూడ ప్రాంతంలో సన్నధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఒక్కోసారి మిల్లుల వద్ద ట్రాక్టర్లు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. సన్నధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని పేర్కొన్నారు. పత్తిలో 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. తేమను పరిశీలించుకునేందుకు ప్రతి క్లస్టర్‌కు ఒక మిషన్ ఇచ్చామన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు పోలీస్ శాఖ తరఫున సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, భద్రాద్రి, ఏఎస్పీ మౌనిక, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, డీఎస్పీ శివరాంరెడ్డి, రాజశేఖర్‌శర్మ, డీసీఓ పత్యానాయక్, డీఎస్‌ఓ వెంకటేశం, డీఎం గోపికృష్ణ, డీఏఓ శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


