న్యాయ అవగాహన పెంపొందించాలి
రామగిరి (నల్లగొండ) : సమాజంలో న్యాయ అవగాహన పెంపొందించడమే పారా లీగల్ వలంటీర్ల అసలైన సేవ అని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తంరావు అన్నారు. శనివారం నల్లగొండలో పారా లీగల్ వలంటీర్లకు ఐడీ కార్డులను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలకు చట్టపరమైన దిశానిర్దేశం ఇవ్వడం ఒక పవిత్రమైన బాధ్యత అన్నారు. ప్రతి వలంటీర్ న్యాయ అవగాహన కలిగిన సమాజ నిర్మాణానికి పునాది వేయాలన్నారు. జిల్లా పారా లీగల్ వలంటీర్ భీమనపల్లి శ్రీకాంత్ న్యూఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ స్వర్ణలత, సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.
దుకాణాల అద్దె తగ్గింపు
చిట్యాల : చిట్యాల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన షాపుల అద్దెలు తగ్గించినట్లు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నర్రా వినొదమోహన్‌రెడ్డి తెలిపారు. చిట్యాల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకుల విజ్ఞప్తి మేరకు షాపుల దరఖాస్తు ఫారం ధరను రూ.వెయ్యికి, ధరవాత్‌ను రూ.20 వేలకు, అద్దెలు గ్రౌండ్ ఫ్లోర్ షాపులకు రూ.4,200కు, పైఅంతస్తు షాపులకు రూ.3900కు తగ్గించినట్లు వెల్లడించారు. ఈ నెల 25న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మార్కెట్ కార్యదర్శి జానయ్య పాల్గొన్నారు.
దీపావళి సురక్షితంగా జరుపుకోవాలి
రామగిరి(నల్లగొండ) : దీపావళి పండుగను ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని 108 అంబులెన్స్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సలీం శనివారం ఒక ప్రకటనలో కోరారు. దీపావళి పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ప్రజలందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పండుగ వేళ చిన్న నిర్లక్ష్యం, అజాగ్రత్త వహిస్తే ప్రమాదాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. 108 అంబులెన్స్ అత్యవసర బృందం కేటాయించిన ప్రాంతాల్లో 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితి ఏర్పడిన వెంటనే 108 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
ఆర్టీసీ లక్కీ డ్రా విజేతలకు బహుమతులు
రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ దసరా స్పెషల్ లక్కీ డ్రాలో విజేతలకు శనివారం బహుమతులు ప్రధానం చేశారు. నల్లగొండ డిపోలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి విజేతలకు నగదు చెక్‌లను అందజేశారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సుల్లో ప్రయాణించి డ్రా బాక్స్‌లో వేసిన టికెట్‌లను శనివారం లక్కీ డ్రా తీసి ముగ్గురిని ఎంపిక చేసినారు. మొదటి బహుమతి వై.రాము (రూ.25 వేలు), రెండవ బహుమతి అనసూర్య (రూ.15 వేలు), మూడవ బహుమతి తోటపల్లి బాలమణి (రూ.10 వేలు) గెలుచుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎం జానిరెడ్డి, డిప్యూటీ డీఎం సుచరిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


