
ముగిసిన తైక్వాండో పోటీలు
ఫ జాతీయ స్థాయికి ఎంపికై న వారిలో
నల్లగొండ బాలిక
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్–14 ఎస్‌జీఎఫ్ తైక్వాండో టోర్నీ శనివారం ముగిసింది. బాలబాలికలకు వివిధ కేటగిరీల్లో తైక్వాండో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు బంగారు, రజత, కాంస్య పతకాలు అందించారు. పోటీల్లో మనస్విని(నిజామాబాద్), జువేరియా కుల్‌సుమ్(నల్లగొండ), సమన్విత(రంగారెడ్డి), కతిజాఫాతిమా(నిజామాబాద్), మగేశ్ మెహరిన్(రంగారెడ్డి), హారిక(రంగారెడ్డి), సమీక్ష(రంగారెడ్డి), టి.వైష్ణవి(హైదరాబాద్) బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరు ఈ నెల 28 నుంచి నాగాలాండ్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగమణి పేర్కొన్నారు.
అనారోగ్య సమస్యలతో ఏఎస్సై బలవన్మరణం
సూర్యాపేటటౌన్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శనివారం సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం పోలీస్‌స్టేషన్‌లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న గోపగాని సత్యనారాయణగౌడ్(53) సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివి ఎన్‌క్లేవ్ టౌన్‌షిప్‌లో నివాసముంటున్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొన్నారు. ఆత్మహత్య వార్తతో సహచరుల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటనపై సత్యనారాయణగౌడ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ బాలునాయక్ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.
పురుగుల మందు తాగి..
గుండాల: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండల కేంద్రానికి చెందిన శ్రీరాముల ఉప్పలయ్య(57) హైదరాబాద్‌లో నివాసముంటూ కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 8న ఇంట్లో గొడవ పడి స్వగ్రామానికి వచ్చి పురుగుల మందు తాగి.. కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారి సహాయంతో 108 వాహనంలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి చిన్న కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం. తేజంరెడ్డి తెలిపారు.
బైక్‌ను ఢీకొట్టిన కారు..
ఒకరికి గాయాలు
భువనగిరిటౌన్ : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం జరిగింది. వివరాలు.. యాకూబ్ అనే వ్యక్తి బైక్‌పై భువనగిరి పట్టణంలోని పహాడీనగర్ నుంచి జగదేవ్‌పూర్ చౌరస్తాకు వస్తుండగా.. ఆర్‌కే ఆస్పత్రి వద్దకు రాగానే వెనుక నుంచి కారు వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన యాకూబ్‌ను స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ముగిసిన తైక్వాండో పోటీలు