
‘నెల్లికల్లు’ పనులు ముమ్మరం
నాగార్జునసాగర్: సాగర తీరంలోని బండలక్వారీ సమీపంలో మూడేళ్ల క్రితం మొదలైన నెల్లికల్లు ఎత్తిపోతల పనులు తిరిగి కొనసాగుతున్నాయి. ఆరునెలల్లో ఒక పంపుతోనైనా నీరు పోయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. గత రెండేళ్లుగా జూలై నుంచి సుమారుగా డిసెంబర్ వరకు జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలోనే ఉండటంతో పనులకు కొంతమేర అంతరాయం కలిగింది. జలాశయంలో నీరు తగ్గుముఖం పట్టిన సమయంలో పనులు జోరందుకుంటున్నాయి. జలాశయంలో 510 అడుగుల నీరు ఉన్నప్పుడు జలాశయ తీరంలో ఎత్తిపోతల పథకానికి నీరు తీసుకునే ప్రాంతంలో నీరుండదు. అందుకుగాను జలాశఽయ తీరంలో ప్రత్యేకంగా బావిని 35మీటర్ల లోతు తవ్వారు. జలాశయం లోపలి నుంచి అప్రోచ్ కెనాల్స్‌ను సుమారుగా 300 మీటర్లకు పైచిలుకే తవ్వడం పూర్తయింది. జలాశయంలోని నీరు బావిలోకి రాకుండా ఉండేందుకు బావి చుట్టూ కాంటూర్ బండ్ ఏర్పాటు చేశారు. బావిలోకి నీటి ఊట రాకుండా దరులకు కాంక్రీట్ చేశారు. దానిలో పంప్‌హౌస్‌ల ఏర్పాటు కోసం స్లాబులు వేసేందుకు సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. జలాఽశయంలో నీరుండటంతో పంప్‌హౌస్‌లోకి నీటి జాలు వచ్చి చేరుతుందని, దీంతో నిత్యం డీవాటరింగ్ చేయాల్సి ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు.
కొనసాగుతున్న పైప్‌లైన్ పనులు
సాగర తీరం నుంచి ఎర్రచెరువు వరకు పైప్‌లైన్ పనులు జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా ఎర్ర చెరువుతండా నుంచి ఇరువైపులా పైపులైన్ వేస్తున్నారు. ఒక పైప్‌లైన్ గోడుమడక వైపు వెళ్తుండగా.. మరో పైప్‌లైన్ యల్లాపురం తండా వైపు వెళ్లనుంది. కొన్ని చోట్ల ఫారెస్ట్ అంతరాయం ఉండటంతో వాటికి క్లియరెన్స్‌లు కూడా వచ్చినట్లు ఇంజనీర్లు తెలిపారు.
24వేల ఎకరాలకు నీరందించే లక్ష్యం
సాగర్‌డ్యాం నిర్మాణ సమయంలోనే జలాశయ తీరప్రాంతానికి సాగు నీరు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. 70 ఏళ్లుగా ప్రజలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వచ్చారు. జలాశయం తీరప్రాంతంలో నెల్లికల్లు లిఫ్ట్ ఏరా్పాటు చేసి వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి తీసుకురావడంతోపాటు తాగునీరు ఇవ్వాలని ఈ ప్రాంత రైతులు, గిరిజనులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోదాడలో నిర్వహించిన పార్టీ మీటింగ్‌లో నెల్లికల్లు లిఫ్ట్‌కు రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2021 ఫిబ్రవరి 10న నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. సాగర్ జలాశయతీరం గిరిజన తండాల్లోని 24వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో లిఫ్ట్ పనులు ప్రారంభమయ్యాయి.
కొనసాగుతున్న పంప్‌హౌస్
స్లాబ్ సెంట్రింగ్ పనులు
ఆరునెలల్లో ఒక పంపుతోనైనా
నీరు పోయించాలని లక్ష్యంగా
పెట్టుకున్న అధికారులు

‘నెల్లికల్లు’ పనులు ముమ్మరం