
‘మిరప’లో తెగుళ్లను నివారిద్దాం
పెద్దవూర: ప్రస్తుతం మిరప చేలు పక్వ దశలో ఉన్నాయి. అనేక చీడపీడలు వ్యాపించి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శిలీంద్రాలు, పురుగులు, సూక్ష్మధాతువు లోపాలు ఉన్నట్లు దీనికి తోడు నల్లతామర పురుగులు వ్యాప్తి ఉంది. కొమ్మ ఎండు, కాయకుళ్లు, బూడిద తెగుళ్లు, కాయతొలిచే పురుగుల వల్ల పంట నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో నాణ్యత తగ్గి తాలుకాయలు ఏర్పడి మార్కెట్‌లో ఆశించిన మద్దతు ధర లభించదు. అందుకు గాను మిరప పంటలో సస్యరక్షణ పద్ధతులు పాటించి కాపాడుకోవాలని ఉద్యానవన క్లస్టర్ అధికారి మురళి రైతులకు సూచిస్తున్నారు.
కొమ్మ ఎండు, కాయకుళ్లు..
మిరప పైరు పూత దశ నుంచి కాయ దశకు వచ్చే సమయాల్లో కొమ్మ ఎండు తెగులు, కాయ కుళ్లు, తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి కారణంగా కొమ్మ, కాయపై బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. వీటి ప్రభావంతో కొమ్మలు పైనుంచి కింది వరకు ఎండిపోతాయి. కాయ సహజ రంగును కోల్పోతుంది.
నివారణ చర్యలు
ఎకరానికి 200 లీటర్ల నీటిలో 200 మి.లీ ప్రొఫికానజోల్, లేదా 100 మి.లీ. డైఫెన్ కొనజోల్, లేదా 200 గ్రాముల ఫైరాక్సీ స్ట్రోబిన్‌ను కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగుళ్లు
చలి, తేమ వంటి వాతావరణం మార్పులతో బూడిద తెగులు సోకుతుంది. ఈ తెగుళ్లను కలిగించే శిలీంధ్రంతో ఆకు కింది భాగంలో బూడిద రంగులో తెల్లటి పొడి ఏర్పడుతుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి.
నివారణ
ఎకరాకు 200 లీటర్ల నీటిలో 300 గ్రాముల గంధకం, లేదా 200 మి.లీ.ల డైనోకాప్, లేదా బెలటాన్, లేదా అజాక్సీస్ట్రోబిన్‌లను కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటర్ నీటిలో 200 మి.లీ. ట్రైౖ డిమార్ఫ్ కలిపి పిచికారీ చేయొచ్చు.
కాయ తొలిచే పురుగు
కాయ తొలిచే పురుగు కాయలను రంధ్రం చేసి లోపలి భాగాన్ని తినడం వల్ల కాయ రాలిపోవడం లేదా కాయ పరిమాణం తగ్గి నాణ్యత, దిగుబడి కోల్పోతుంది.
నివారణ
లీటర్ నీటిలో 1.5 గ్రాముల అసిఫేట్, లేదా ఒక మి.లీ నుపులురాన్, లేదా 0.3 మి.లీ.ల రైనాక్సీఫైర్, లేదా 0.3 గ్రాముల ప్లూబెండమైడ్‌ను కలిపి పిచికారీ చేయాలి.
జింకు లోపం
భాస్వరం ఎక్కువగా వాడితే జింకులోపం కనిపిస్తుంది. ఆకుల కనుపుల మధ్య పసుపు పచ్చ రంగులోకి మారి రాలిపోతుంది.
నివారణ
జింకులోపం నివారణకు లీటర్ నీటిలో 2 గ్రాముల చీలేటెడ్ జింక్‌ను కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
పక్షికన్ను మచ్చ తెగులు
తేమతో కూడిన చల్లటి వాతావరణంలో మిరప ఆకులపై సర్కోస్పోరా, ఆల్టర్‌నేరియా మచ్చలు ఆశిస్తాయి. సర్కోస్పోరా ఆశిస్తే పక్షికన్ను ఆకారం గల మచ్చలు ఏర్పడతాయి. ఈ ప్రభావంతో పంటలో నాణ్యత, రంగు తగ్గుతాయి.
నివారణ
200లీటర్ల నీటిలో 200 మి.లీ.ల ప్రొపికోనజోల్‌ను కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేసుకోవాలి. లేదా 100మి.లీ.ల డైఫెన్‌కొనజోల్‌ను కలిపి పిచికారీ చేయాలి.

‘మిరప’లో తెగుళ్లను నివారిద్దాం