
ఎడమకాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మునగాల: మునగాల మండల పరిధిలోని బరాఖత్‌గూడెం శివారులో గురువారం సాగర్ ఎడమకాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కాలువ వద్దకు చేరుకొని మృతదేహాన్ని వెలికితీసినట్లు తెలిపారు. అతడి వయస్సు 40–45ఏళ్ల మధ్య ఉండవచ్చని తెలిపారు. మృతదేహం ఆచూకీ నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచామని, వివరాలకు 87126 86048, 96666 92085 నంబర్లను సంప్రదించాలని ఎస్‌ఐ పేర్కొన్నారు.
భువనగిరి మున్సిపాలిటీ
కార్యాలయం ఎదుట..
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆకుపచ్చ–నలుపు రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మునగాల: మండలంలోని కృష్ణానగర్ గ్రామ శివారులో గల సాగర్ ఎడమకాలువ(పాలేరు)లో బుధవారం గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో లభ్యమైంది. నడిగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్ గ్రామానికి చెందని భుక్యా బాబునాయక్(42) బుధవారం అయ్యప్ప మాల స్వీకరించాడు. అదే రోజు సాయంత్రం స్నానమాచరించేందుకు మిగతా మాలధారులతో కలిసి సాగర్ ఎడమకాలువ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో స్నానం చేస్తుండగా భుక్యా బాబునాయక్ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. గురువారం పాలేరు జలాశయంలో అతడి మృతదేహం కనిపించింది. మృతుడి కుమారుడు భుక్యా భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నడిగూడెం పోలీసుల కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రైలు నుంచి జారిపడి
వ్యక్తి మృతి
తిప్పర్తి: తిప్పర్తి మండలంలోని రాయినిగూడెం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు రైల్వే ఎస్సై రామకృష్ణ గురువారం తెలిపారు. సుమారు 50సంవత్సరాల వయసు గల వ్యక్తి ఈనెల 8న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పార్వతిపురం వరకు టికెట్ తీసుకున్నాడని, మిగిలిన ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. నల్లగొండ స్టేషన్ మాస్టర్ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పత్తి తీసేందుకు వెళ్లిన
మహిళా కూలీ అదృశ్యం
నడిగూడెం : పత్తి తీసేందుకు వెళ్లిన మహిళా కూలీ ఈ నెల 7న అదృశ్యమైంది. స్థానిక ఎస్‌ఐ గందమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన పఠాన్ జానిబేగం (38) ఈనెల 7న తమ గ్రామానికి చెందిన తోటి కూలీలతో కలిసి ఆటోలో ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రాంతంలో పత్తి తీసేందుకు వెళ్లింది. తర్వాత జానిబేగం ఇంటికి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త పఠాన్ జాఫర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.