
ఏసీబీకి చిక్కిన చిట్యాల తహసీల్దార్
చిట్యాల: ల్యాండ్ మ్యుటేషన్, ఇన్‌స్పెక్షన్ రిపోర్టు ఇచ్చేందుకుగాను నల్లగొండ జిల్లా చిట్యాల మండల తహసీల్దార్ గగులోతు కృష్ణ ఓ రియల్ ఎస్టేట్స్ సంస్థ ద్వారా లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి రెవెన్యూ పరిధిలోని 172 సర్వే నంబర్‌కు సంబంధించి ల్యాండ్ మ్యుటేషన్, 167 సర్వే నంబర్‌పై ఇన్‌స్పెక్షన్ రిపోర్టు కోసం మెస్సర్స్ రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇటీవల తహసీల్దార్ గగులోతు కృష్ణను ఆశ్రయించింది. ఇందుకుగాను తహసీల్దార్ రూ.10లక్షలు డిమాండ్ చేయగా.. సంస్థ రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందస్తుగా రూ.2లక్షలను ప్రైవేటు వ్యక్తి గట్టు రమేష్‌కు ఇవ్వాలని తహసీల్దార్ సూచించారు. ఈ విషయంపై సంస్థ ప్రతినిధులు ఫోన్ ద్వారా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం సంస్థ ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయం బయట రమేష్‌కు రూ.2లక్షలను అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు రికవరీ చేయడంతోపాటు, రమేష్‌ను, తహసీల్దార్ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. హైదరాబాద్‌లోని తహసీల్దార్‌కు చెందిన ఇంటిలో కూడా సోదాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మైనింగ్ విషయంలోనూ ఆరోపణలు
తహసీల్దార్ కృష్ణపై మైనింగ్ విషయంలో ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో తహసీల్దార్ కృష్ణ చిట్యాల మండలానికి వచ్చారు. వెలిమినేడు, పెద్దకాపర్తి పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా తన వ్యవసాయ క్షేత్రం వద్ద వేసిన షెడ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని పేర్కొంటూ వాటిని కూల్చివేయించి ఆస్తినష్టం కలిగించారని చిన్నకాపర్తికి చెందిన బోయపల్లి శ్రీనివాస్ తహసీల్దార్ కృష్ణపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.
ల్యాండ్ మ్యుటేషన్, ఇన్‌స్పెక్షన్ రిపోర్టు ఇచ్చేందుకు రూ.10లక్షలు డిమాండ్
రూ.2లక్షలు తీసుకుంటుండగా
పట్టుకున్న అధికారులు