
కంటైనర్ ఢీకొని హోంగార్డు దుర్మరణం
రామన్నపేట: విధి నిర్వహణలో ఉన్న హోంగార్డును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుఝామున రామన్నపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన కూరెళ్ల ఉపేంద్రాచారి(35) రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం తెల్లవారుఝామున రామన్నపేట సుభాష్ సెంటర్‌లో అతడు మరో కానిస్టేబుల్‌తో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉపేంద్రాచారి భువనగిరి నుంచి చిట్యాల వైపు వెళ్తున్న కంటైనర్‌ను ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో హోంగార్డును ఢీ కొట్టింది. దీంతో అతడి తలభాగం పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శోభ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోంగార్డును ఢీకొట్టి అక్కడి నుంచి పరారైన కంటైనర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉపేంద్రాచారి మృతితో ఆస్పత్రి ఆవరణలో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి.
హోంగార్డుకు
ప్రముఖుల నివాళి
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు కూరెళ్ల ఉపేంద్రాచారి మృతదేహాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, అడిషనల్ ఎస్పీ వినోద్‌కుమార్, అడ్మిన్ ఆర్‌ఐ శ్రీనివాస్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం రూ.20వేల ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా హోంగార్డు సంక్షేమ నిధి నుంచి తక్షణ సాయంగా రూ.10వేలు, భువనగిరి హెడ్‌క్వార్టర్స్ తరపున రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీపీ సుధీర్‌బాబుకు ఫోన్‌చేసి ఉపేంద్రాచారి భార్యకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. అదేవిధంగా ఉపేంద్రాచారి మృతదేహాన్ని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ నాగరాజు సందర్శించి నివాళులర్పించారు.