హాలియా : ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని పేరూర్ బ్రిడ్జి కూలిపోయింది. సోమ సముద్రం చెరువు ఉధృతంగా ప్రవహించడంతో గురువారం రాత్రి వరద తాకిడికి సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయింది. అనుముల మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు ఈ వంతెన గుండా రాకపోకలు సాగిస్తుంటారు. వంతెన కొట్టుకుపోవడంతో పేరూర్ గ్రామంతో పుల్లారెడ్డిగూడెం, వీర్లగడ్డతండా, ఆంజనేయ తండా గ్రామాలకు చెందిన ప్రజలు తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రం గుండా హాలియాకు తమ ప్రయాణాలు కొనసాగించాల్సి వస్తోంది. స్థానిక ఎస్‌ఐ సాయి ప్రశాంత్ తన సిబ్బందితో కూలిన వంతెనను పరిశీలించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రహదారి సమస్యను పరిష్కరించడానికి హాలియా నుంచి రెండు వరుసల రహదారి తో పాటు నూతన వంతెన నిర్మాణానికి సుమారు రూ.కోటితో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.
వరద ఉధృతికి కూలిన పేరూర్ బ్రిడ్జి