
బాలాజీ అరెస్ట్‌కు రంగం సిద్ధం
ఆశచూపి.. రూ.కోట్లు వసూలు చేసి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అధిక వడ్డీకి ఆశ పడి మోసపోయిన వారి ఆందోళనలు ఓవైపు.. డబ్బులు ఇచ్చినా సకాలంలో తమకు తిరిగి చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న పలుగుతండా వాసి ఘటన మరోవైపు.. వెరసీ బాలాజీ నాయక్‌పై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. పీఏపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ నాయక్ అధిక వడ్డీ ఆశచూపి అమాయక ప్రజల నుంచి రూ.కోట్లు తీసుకొని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ఆత్మహత్యకు యత్నించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎష్ట్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ –1999 ప్రకారంతోపాటు ప్రజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన బాలాజీ నాయక్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మరోవైపు అతని పేరున ఏమేం ఆస్తులు ఉన్నాయి.. ఎక్కడెక్కడ ఉన్నాయన్న వివరాలను సేకరించి, వాటిని జప్తు చేయాలని రెవెన్యూ శాఖను కోరారు. దీంతో వారు రంగంలోకి దిగారు.
దేవరకొండ ప్రజల పేరుతో గతంలోనే ఫిర్యాదు
అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను మోసం చేశాడంటూ బాలాజీ నాయక్‌పై గత జూన్‌లోనే దేవరకొండ ప్రజల పేరుతో ఒక ఫిర్యాదు వచ్చింది. వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు అతన్ని పిలిపించి విచారణ జరిపారు. మూడు నెలల్లో చెల్లిస్తానని చెప్పడంతో వదిలేశారు. ఈనెల 7న పలుగుతండాకు చెందిన సరియా తాను ఇచ్చిన రూ.20 లక్షల డబ్బులను బాలాజీ తిరిగి ఇవ్వడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నించి చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఇది తెలిసిగ్రామానికి చెందిన బాధితులు గ్రామంలోని బాలాజీ నాయక్ ఇంటిపై దాడికి దిగారు. ఇంటిముందున్న కారును తగులబెట్టారు. మరోవైపు బుధవారం మిర్యాలగూడ, నేరడుచర్లలోని అతని బంధువుల ఇళ్ల ముందు ఆందోళనకు దిగారు. తాజాగా గురువారం లోక్యా అనే వ్యక్తి కూడా పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు బాలాజీ నాయక్‌ను అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.
ఆత్మహత్యలు సరికాదు
పెద్దఅడిశర్లపల్లి : అధిక వడ్డీ బాధితులు ఆత్మహత్యకు పాల్పడడం సరికాదని గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు సూచించారు. బాధితులెవరూ ఆందోళన చెందొద్దని, నేరుగా తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, డబ్బులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశచూపి నమ్మించాడు. రూ.వందకు రూ.10 నుంచి రూ.16ల వరకు వడ్డీ ఇస్తానని నమ్మబలికి వారి నుంచి రూ.వందల కోట్లు వసూలు చేశాడు. ముందుగా బంధువుల వద్ద అప్పులు తీసుకొని, వారికి ప్రతీనెల వడ్డీ చెల్లించాడు. అది ఆ నోటా ఈ నోటా గ్రామం, మండలం, జిల్లానే కాదు ఇతర జిల్లాలకు వ్యాపించింది. దీంతో అధిక వడ్డీ కోసం అనేక మంది తమ ఇళ్లు, భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి మరీ అతనికి అప్పులు ఇచ్చారు. మొదట్లో తనతోపాటు ఒకరిద్దరిని మాత్రమే కలుపుకొని అధిక వడ్డీ పేరుతో దందా ప్రారంభించి, ఆ తరువాత 15 మంది ఏజెంట్లను నియమించుకొని మరీ కొనసాగించాడు. ఇలా దేవరకొండ, నల్లగొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌తోపాటు, రంగారెడ్డి జిల్లాలోనూ వసూళ్లు చేశారు. 16 బ్యాంకు అకౌంట్ల ద్వారా వేల మంది నుంచి రూ.వందల కోట్ల దందా కొనసాగించాడు. అయితే మొదట్లో అప్పులు ఇచ్చిన వారికి వడ్డీ చెప్పినట్లుగానే చెల్లించినా, అసలు ఇవ్వకపోవడంతో ఆందోళన మొదలైంది. దీంతో దేవరకొండ ప్రాంత పబ్లిక్ ఫ్రాడ్ అవేర్‌నెస్ గ్రూపు పేరుతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి గత జూన్ నెలలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు కలెక్టర్ పంపించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారించారు. ఇక అప్పటి నుంచి బాలాజీ నాయక్ తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో మంగళవారం సరియా ఆత్మహత్య చేసుకోగా, గురువారం మరొకరు ఆత్మహత్యకు యత్నించగా, అతనికి అప్పులు ఇచ్చిన మిగితా వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఫ అధిక వడ్డీ ఆశచూపి అమాయకుల నుంచిరూ.కోట్లు కొట్టేసిన బాలాజీ నాయక్
ఫ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుల ఆందోళన
ఫ అప్పు ఇచ్చిన వారిలో ఒకరి ఆత్మహత్య నేపథ్యంలో కేసు నమోదు
ఫ ఆస్తులు జప్తు చేసేలా రెవెన్యూ శాఖకు పోలీసుల లేఖ