
ధాన్యం కొనుగోళ్లు షురూ
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. రైతులు తొందరపడి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులు, మిల్లర్లకు అమ్ముకోవద్దు. కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తున్నందున నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి.
– వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, మిర్యాలగూడ : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని పలు చోట్ల ఇప్పటికే వరి కోతలు మొదలు కాగా, మరికొన్ని చోట్ల వరి కోత పూర్తి చేసుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించారు. అక్కడే ధాన్యాన్ని ఆరపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొత్తం 375 కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. బుధవారం 50 కేంద్రాల్లో (25 ఐకేపీ, 24 పీఏసీఎస్) కొనుగోళ్లు షూరు అయ్యాయి. తిప్పర్తి మండలం కేంద్రం, మాడ్గులపల్లి మండలం గారకుంటపాలెం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించి రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం నిర్ధేశిత తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
375 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో మొత్తం 375 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా అందులో ఐకేపీ ఆధ్వర్యంలో 172, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 203 కేంద్రాలను ప్రారంభించనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకుంటే ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,389, బి గ్రేడ్ రకానికి రూ.2,369 ఇస్తారు. ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుంది. ధాన్యం కొనుగోలుకు 1.57కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా.. ప్రస్తుతం 74 లక్షల గన్నీ బ్యాగ్‌లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
6.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు 5,26,796 ఎకరాల్లో వరి సాగు చేయగా, 2,56,665 ఎకరాల్లో సాధారణ రకం, 2,70,131 ఎకరాల్లో సన్నరకం సాగు చేశారు. తద్వారా 13,44,268 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 6,83,802 మెట్రిక్ టన్నులు సాధారణ రకం, 6,60,465 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం దిగుబడి రానుంది. అందులో రైతులు సొంత అవసరాలకు వినియోగించే ధాన్యం 2,40,250 మెట్రిక్ టన్నులు, మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం 4,73,036 మెట్రిక్ టన్నులుపోగా, అమ్మకానికి 6,30,981 మెట్రిక్ మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది. అందులో సాధారణ రకం (దొడ్డు ధాన్యం) 4,65,657 మెట్రిక్ టన్నులు, సన్న రకం 1,65,324 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కల్పించాల్సిన సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో 40 వరకు టార్పాలిన్లు, నాలుగైదు వేయింగ్ స్కేల్ మిషన్లు, రెండు చొప్పున మాయిచ్చర్ (తేమ శాతం తేల్చే) మీటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన గోనె సంచులను సమకూర్చాలని సూచించారు. కేంద్రాలకు వచ్చే రైతులకు అవసరమైన సదుపాయాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. సన్న ధాన్యం క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తున్నందునా ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.
కేంద్రాల వద్ద కనిపించని సౌకర్యాలు..
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన ధాన్యం వచ్చిన వెంటనే నాణ్యతను పరిశీలించి కాంటా వేసి ఎగుమతి చేయాల్సి ఉన్నా.. కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధాన్యపు రాశులు నిల్వ ఉండడంతో నాణ్యతను పరిశీలించడం, కాంటాలు వేయడంలో ఆలస్యం అవుతోంది. దాని వల్ల రైతులు ధాన్యం రాశుల వద్దనే రాత్రింబవళ్లు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు. అంతేకాకుండా కేంద్రాల వద్ద మంచినీరు, టెంట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
ఫ ఇప్పుడిప్పుడే కేంద్రాలకు వస్తున్న ధాన్యం
ఫ 375 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధం
ఫ 50 చోట్ల కొనుగోళ్లు ప్రారంభించిన అధికారులు
ఫ తిప్పర్తి, మాడుగులపల్లిలో కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్
ఫ 6.30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం