
హాలియా ఎస్‌బీఐ శాఖలో అగ్ని ప్రమాదం
హాలియా: హాలియా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి బ్యాంకులో ఉన్న అలారం మోగింది. దీంతో వాచ్‌మెన్ గమనించి బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు, పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ఎస్‌ఐ సాయిప్రశాంత్ తమ సిబ్బందితో బ్యాంకు వద్దకు చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఏసీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నీచర్ కాలిబూడిదయ్యాయి. బ్యాంకు మేనేజర్ మోహన్‌ని వివరణ కోరగా.. షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు గుర్తించామని, ఈ ఘటనపై ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యమైన డాక్యూమెంట్లకు ఏమీ కాలేదని, ఒక కంప్యూటర్, రెండు ఏసీలు, కొంత ఫర్నీచర్ మాత్రం కాలిపోయిందని తెలిపారు.
ప్రమాదంపై ఆరా..
బ్యాంకులో జరిగిన ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు, బ్యాంకులో తాకట్టు పెట్టిన షూరిటీ పత్రాలు, బంగారం, నగదు తదితర వివరాలపై ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం అధికారులు రానున్నట్లు తెలిసింది. ఎస్‌ఐ సాయి ప్రశాంత్, అగ్నిమాపక అధికారులు బ్యాంకు అధికారులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు.
ఫ షార్ట్ సర్క్యూట్‌తో ఫర్నీచర్,
కంప్యూటర్లు, ఏసీలు,
ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధం