
హత్యాచారం కేసులో ఇద్దరికి రిమాండ్
రామగిరి(నల్లగొండ): ఇంటర్ విద్యార్థినిపై హత్యాచారం కేసులో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం జీకే అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ(21) ప్రేమ పేరుతో ఇంటర్ చదువుతున్న విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. గత మూడు నెలలుగా ఇన్‌స్ట్రాగాం ద్వారా ఆమెతో చాటింగ్ చేశాడు. సదరు విద్యార్థిని మంగళవారం ఇంటి నుంచి కాలేజీకి బయల్దేరి నల్లగొండకు వచ్చింది. నల్లగొండ పట్టణంలోని డీఈఓ కార్యాలయం వద్ద వేచి చూస్తున్న విద్యార్థిని వద్దకు గడ్డం కృష్ణ బైక్‌పై వచ్చి ఆమెను తన స్నేహితుడైన నల్లగొండ మండలం రసూల్‌పుర గ్రామానికి చెందిన బచ్చలకూరి మధు(19) రూమ్‌కి తీసుకెళ్లాడు. కృష్ణ, ఆ విద్యార్థిని రూమ్‌లో ఉండగా.. మధు బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కృష్ణ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందింది. వెంటనే కృష్ణ రూమ్‌కి తాళం వేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా కృష్ణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే రోజు సాయంత్రం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కృష్ణ లొంగిపోయాడు. కృష్ణ ఇచ్చిన సమాచారం ఆధారంగా అతడి స్నేహితుడు మధును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కృష్ణ, మధుపై పోలీసులు అత్యాచారం, హత్య, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ విధించి కోర్టులో హాజరుపరిచారు. విలేకరుల సమావేశంలో టూటౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు సైదులు, సైదాబాబు పాల్గొన్నారు.