
ఆ గ్రామాల్లో దసరా ప్రత్యేకం
రాజాపేట : దసరా పండుగను రాజాపేట మండల కేంద్రంలో ఠాకూర్ వంశస్తులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. చాలామంది హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ పండుగ రోజు స్వగ్రామానికి విచ్చేసి వేడుకల్లో పాల్గొంటారు. రాజుల కాలం నుంచి గ్రామానికి చెందిన ఠాకూర్ వంశస్తులు దుర్గామాతకు నవరాత్రులు పూజలు నిర్వహించి 9వ రోజు ఆయుధపూజ నిర్వహిస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి గుర్రం(సిరిమల్లె) వంశీయులతో కలిసి డప్పువాయిద్యాలతో గడికోటలోని మైసమ్మ దేవాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజ లు చేస్తారు. అనంతరం జాతీయ జెండాను చేతబూని తల్వార్లతో ప్రదర్శన నిర్వహిస్తూ జమ్మి కోసం బయల్దేరుతారు. గ్రామం శివారులోని సంఘమేశ్వరస్వామి దేవాలయం వరకు చేరుకుని జమ్మి వృక్షానికి పూజలు చేస్తారు. పూర్వం మాత్రం ఠాకూర్ వంశానికి చెందిన సత్యనారాయణసింగ్ తనకున్న లైసెన్స్ గన్ భుజానికి వేసుకుని ఊరేగింపుగా వెళ్లి శమిపూజ తర్వాత గన్‌తో రెండుమార్లు తూర్పుదిక్కు గాలిలోకి పేల్చిన అ నంతరం ప్రజలు జమ్మి తీసుకునేవారు. ఠాకూర్ సత్యనారాయణసింగ్ 1994 వరకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండల కేంద్రంలో, రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో ప్రతి ఏడాది దసరా పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. లక్ష్మాపురం గ్రామంలో దసరా రోజు గ్రామస్తులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాజాపేట మండల కేంద్రంలో ఠాకూర్ వంశస్తులు జాతీయ జెండా, తల్వార్లతో ర్యాలీగా జమ్మిచెట్టు వద్దకు వెళ్లి పూజలు చేస్తారు.
రామన్నపేట: రాన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో దసరా రోజు జాతీయ జెండాను ఎగురవేస్తారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి కచ్చీరు వద్ద జాతీయ జెండాను ఎగురవేసే సంప్రదాయం కొనసాగుతోంది. గ్రామానికి చెందిన పటేల్ వంశస్థులు పండుగ రోజు తెల్లవారుజామున పాత జాతీయ జెండాను అవనతం చేస్తారు. ఉదయం 10గంటల సమయంలో డప్పుచప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించి కొత్త జెండా కర్రకు అలంకరణ చేసి కొత్త తాడుతో జాతీయ జెండాను ఎగర వేయడం జరుగుతుంది. జాతీయ పతాకావిష్కరణలో గ్రామస్తులంతా పాల్గొంటారు. జమ్మిచెట్టు వద్దకు పూజకు వెళ్లే సమయంలో అక్కడే పూజలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు, కులపెద్దలకు కంకణాలు అందజేస్తారు. జమ్మిచెట్టు నుంచి జాతీయజెండా వద్దకు తిరిగి వచ్చి ఒకరికొకరు జమ్మి పెట్టుకొని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అదేవిధంగా నిధానపల్లిలో బురుజుపైన, నీర్నెముల, శోభనాద్రిపురం, సిరిపురం గ్రామాల్లో గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
ప్రత్యేకంగా
ఠాకూర్ వంశస్తులు
దసరా రోజు జాతీయ
జెండా ఆవిష్కరణ

ఆ గ్రామాల్లో దసరా ప్రత్యేకం