
కార్మిక చట్టాలను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం
హాలియా : ఎందరో బలిదానాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా సంస్కరణలు చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ఆరోపించారు. ఆదివారం హాలియా పట్టణంలోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన సాగర్ నియోజకవర్గ సీఐటీయూ విస్తృత జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోరాడి సాఽధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి 44కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడులుగా కుందించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను తగ్గిస్తూ సామాజ్యవాదులు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు అవుతా సైదులు, నాయకులు ఎస్‌కె బషీర్, వెంకటమ్మ, లక్ష్మమ్మ, నర్సారెడ్డి, చంద్రయ్య, వెంకటేశ్వర్లు, సయ్యద్ హుసెన్, చిరంజీవి, వేణుగోపాల్, సైదిరెడ్డి, నన్నే సాహెబ్, శ్రీను, అనూష తదితరులు ఉన్నారు.