
అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారు
నల్లగొండ : సాగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు అనర్హులకు ఇస్తున్నారని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, పథకాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్ డేలో ఆయన అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నీ అనర్హులకే అందుతున్నాయన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కలుగడం లేదన్నారు. అధికారులు ఏకపక్షంగా కాంగ్రెస్‌కు సహకరిస్తున్నారని ఆరోపించారు. సాగర్ నియోజక వర్గంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఫోన్ చేసినా స్పందించడం లేదని.. నాయకులతో కలిసి నేరుగా మొర పెట్టుకుందామని వచ్చినా కలెక్టర్ అదుబాటులో లేరని అన్నారు. ప్రభుత్వం ఎవరిదైనా.. పేదల న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆయన వెంట అనుముల శ్రీనివాస్‌రెడ్డి, శ్యామ్‌సుందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్