మరణాల సంఖ్య తగ్గుతుంది
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిరకాల వైద్య సదుపాయాలున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. గర్భిణుల్లో కూడా చైతన్యం వచ్చింది. మంచి పౌష్టికాహారం తీసుకుని వైద్యుల సలహాలు పాటిస్తున్నారు. తద్వారా మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుతుంది.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ
నల్లగొండ టౌన్: వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలతో జిల్లాలో మాతా, శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టింది. ఆరేళ్ల క్రితం వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతోపాటు సకాలంలో వైద్యం అందకపోవడంతో మాతా, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండేది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో అన్నిరకాల మౌలిక సదుపాయలు కల్పించింది. ప్రత్యేక వైద్యులను నియమించింది. దీనికితోడు నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబందంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి నిష్ణాతులైన ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులను నియమించింది. వైద్య పరీక్షల కోసం అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, నవజాత శిశువులకు అవసరమైన ఐసీయూ, కేఎంసీతోపాటు అన్ని విభాగాలను ఏర్పాటుచేసి వైద్యసేవలను మెరుగుపర్చింది. ఫలితంగా ఆరేళ్లుగా మాతా శిశు మరణాల సంఖ్య ఏటేటా తగ్గుముఖం పట్టింది.
వాట్సప్ గ్రూప్‌లో వివరాలు
జిల్లాలోని మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, నాగార్జునసాగర్ ఏరియా ఆసుపత్రులకు ప్రసవాల కోసం వెళ్లిన వారికి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అత్యవసర చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. రెఫర్ చేసిన వెంటనే ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఎంసీహెచ్ వాట్సప్ గ్రూప్‌లో గర్భిణుల వివరాలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అందించాల్సిన వైద్యం వివరాలను నమోదు చేస్తున్నారు. ఆ వాట్సప్ గ్రూప్‌లో ఎంసీహెచ్ ఇన్‌చార్జి, గైనిక్ హెచ్‌వోడీ, చిన్నపిల్లల విభాగం ఇన్‌చార్జి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, ఇతర విభాగాల ఇన్‌చార్జిలు ఉంటారు. దీనివల్ల వెంటనే వైద్యులు అలర్ట్ అయ్యి రోగి రాగానే సకాలంలో వైద్యం అందిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కూడా అందించలేని పరిస్థితి ఉంటే వారిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేసిన వెంటనే రాష్ట్ర స్థాయిలో ఎంసీహెచ్ వాట్సప్ గ్రూప్‌లో రోగి వివరాలు నమోదు చేస్తున్నారు. వెంటనే ఆయా ఆసుపత్రుల అధికారులను అప్రమత్తం చేసి సకాలంలో వైద్యం అందేలా చూస్తున్నారు.
సత్ఫలితాలిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలు
గర్భం దాల్చిన నుంచి తల్లీబిడ్డ
ఇల్లు చేరేవరకు పర్యవేక్షణ
వాట్సప్ గ్రూప్‌లో రెఫరల్
కేసుల వివరాలు
తగిన చికిత్స అందిస్తున్న వైద్యులు
మాతా, శిశు మరణాల వివరాలు..
సంవత్సరం మాత శిశు
2018–19 14 335
2019–20 18 395
2020–21 08 329
2021–22 26 310
2022–23 13 317
2023–24 12 216
2024–25 10 221
గర్భిణుల నమోదు నుంచే పర్యవేక్షణ
మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం తర్వాత తల్లిబిడ్డలను ఇంటికి చేర్చే వరకు వైద్య ఆరోగ్య శాఖ నిత్యం పర్యవేక్షిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు.. గర్భిణుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వారిని పరీక్షల నిమిత్తం ప్రతినెలా ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. టీకాలు వేయించడం రక్తహీనత అధికమించేందుకు మందులను ఇప్పించడం పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. నెలలు నిండగానే 102 వాహనంలో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళుతున్నారు. కాన్పు జరిగిన అనంతరం తల్లిబిడ్డను ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేరుస్తున్నారు. నిత్య పర్యవేక్షణతో మాతా శిశుమరణాల సంఖ్య తగ్గిందని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది.
మాతా, శిశు మరణాలు తగ్గాయ్!