
చెత్తకుప్పలుగా ఓపెన్ ప్లాట్లు
దేవరకొండ : దేవరకొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దేవరకొండ మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా దాదాపు 40వేల పైచిలుకు జనాభా ఉన్నట్లు అంచనా. నిత్యం దాదాపు 16టన్నుల చెత్తను మున్సిపల్ అధికారులు పట్టణంలోని సేకరిస్తున్నారు. 11 ఆటోలు, ట్రాక్టర్లు ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మొత్తం 77మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. అయినప్పటికీ ఓపెన్ ప్లాట్లు, ఖాళీ ప్రదేశాల్లో జనం చెత్త వేస్తున్నారు. చెత్తను బయట పడవేస్తే జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నా.. పట్టించుకోవడం లేదు. పట్టణంలోని శివారు కాలనీల్లో మురుగుకాల్వల నిర్మాణం లేకపోవడం.. డ్రెయినేజీలు ఉన్న చోట నిర్వహణ సరిగా లేకపోవడంతో పలు చోట్ల రోడ్లపైనే మురుగు పారుతోంది. దీంతో జనం దుర్వాజన, దోమలు, ఈగల బెడదతో అల్లాడుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.