
పేదల పక్షాన సీపీఐ నిరంతర పోరాటం
డిండి : దేశంలో పేదరికం ఉన్నంత కాలం ప్రజల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఈడెన్ గార్డెన్‌లో నిర్వహించిన సీపీఐ మండల 15వ మహాసభకు ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సీపీఐ నాయకత్వం వహించిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ప్రజా సమస్యలను విస్మరించి పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తుందని ఆయన ఆరోపించారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటరమణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మైనొద్దిన్, జిల్లా సమితి సభ్యుడు తూం బుచ్చిరెడ్డి, మండల కార్యదర్శి కనకాచారి, మండల సహాయ కార్యదర్శులు విజేందర్‌రెడ్డి, శైలేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.