
డ్రైవింగ్ ట్రాక్.. తరలింపు!
కలెక్టరేట్ విస్తరణకు ఆర్‌టీఏ డ్రైవింగ్ ట్రాక్ తొలగించాలని నిర్ణయం
దండంపల్లికి మార్చేలా..
ప్రస్తుతం కలెక్టరేట్ వెనుక భాగంలో రూ.33 కోట్లతో కలెక్టరేట్ అదనపు భవనాన్ని నిర్మిస్తున్నారు. రెండు నెలల కిందట జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అప్పటి నుంచి ఆ భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని చదును చేస్తున్నారు. అందులో భాగంగా కలెక్టరేట్‌కు ఆర్‌టీఏ కార్యాలయానికి మధ్య ఉన్న ప్రహరీని తొలగించారు. దాంతోపాటు ఆర్‌టీఏ కార్యాలయంలోని డ్రైవింగ్ టెస్టులు నిర్వహించే ట్రాక్‌ను కూడా అక్కడ నుంచి తొలగించి ఆ స్థలాన్ని కూడా కలెక్టరేట్‌కు వినియోగించేలా పక్కనే చదును చేస్తున్నారు. ట్రాక్ కోసం అధికారులు ఇప్పటికే నల్లగొండ పట్టణ సమీపంలోని హైదరాబాద్ రోడ్డులో, అలాగే దండెంపల్లిలో స్థలాలను పరిశీలించారు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న స్థలం లిటిగేషన్‌లో ఉండటంతో దండెంపల్లిలో గతంలో కోళ్ల పరిశ్రమ కోసం ఇచ్చిన స్థలం సమీపంలోనే టెస్టింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కలెక్టరేట్ విస్తరణలో రవాణా శాఖ (ఆర్‌టీఏ) కార్యాలయంలోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ మార్పు తప్పేలా లేదు. కలెక్టరేట్ విస్తరణలో భాగంగా కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఆర్‌టీఏ కార్యాలయంలోని ట్రాక్ ఉన్న స్థలంలో కలెక్టరేట్ అదనపు బ్లాక్‌ను నిర్మించాలని జిల్లా యంత్రాంగం ఇటీవల నిర్ణయించింది. ఇందుకు జిల్లా మంత్రులు శంకుస్థాపన చేశారు. దీంతో చదును చేసే పనులను కూడా ప్రారంభించారు. ఇప్పటికే ఆర్‌టీఏ కార్యాలయం ప్రహరీని తొలగించారు. ట్రాక్ కూడా అక్కడ నుంచి తొలగించాల్సి వస్తోంది. ఊరి చివరలో ఉన్న దండెంపల్లికి ట్రాక్‌ను మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఆర్‌టీఏ కార్యాలయానికి డ్రైవింగ్ టెస్టుల కోసం వచ్చే వారికి భవిష్యత్‌లో తిప్పలు తప్పేలా కనిపించడం లేదు.
పదేళ్ల క్రితం నుంచి ఒకేచోట..
ఆర్‌టీఏ కార్యాలయం గతంలో హైదరాబాద్ రోడ్డులో ప్రైవేట్ భవనంలో ఉండేది. మరోవైపు ట్రాక్ మాత్రం ప్రస్తుతం ఉన్న ఆర్‌టీఏ కార్యాలయ ఆవరణలో ఉండేది. దీంతో వాహనదారులు రెండు చోట్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వెనుక భాగంలోని ప్రభుత్వ స్థలంలో పదేళ్ల కిందట సొంత భవనాన్ని నిర్మించారు. దీంతో లైసెన్స్‌ల కోసం కార్యాలయ పనితోపాటు డ్రైవింగ్ టెస్టులు ఒకేచోటకు రావడంతో ఇబ్బందులు తప్పాయి. ప్రస్తుతం మళ్లీ కలెక్టరేట్ విస్తరణలో ఆర్‌టీఏ కార్యాలయం మార్చాల్సి వస్తుందడంతో జనాలకు ఇబ్బందులు తప్పేలా లేవు.
ట్రాక్ తరలిస్తే ఇబ్బందులే..
డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌ను దండెంపల్లిలో ఏర్పాటు చేసి, రవాణా కార్యాలయాన్ని మాత్రం అక్కడే ఉంచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్ ఇతరత్రా కార్యాలయ పనులకోసం కలెక్టరేట్ వెనుక ఉన్న ఆర్‌టీఏ కార్యాలయానికి వెళ్లాలి. ఇక ట్రాక్‌ను దండెంపల్లికి తరలిస్తే డ్రైవింగ్ టెస్టు కోసం అక్కడికి వెళ్లాల్సిందే. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆర్‌టీఏ కార్యాలయానికి రావడమే కష్టం. అలాంటిది ఒక పనికోసం ఇటు ఆర్‌టీఏ కార్యాలయానికి, అటు దండంపల్లికి వెళ్లి టెస్టింగ్‌లు చేయాలంటే మరింత ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ టెస్టుల కోసం ప్రతినెలా వచ్చే వందల మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాబోతోంది.
ట్రాక్ వరకు స్థలాన్ని
వదిలేయాలంటున్న ఆర్‌టీఏ సిబ్బంది
ఆర్‌టీఏ కార్యాలయానికి గతంలోనే సొంత భవనం నిర్మించారు. స్థలం కూడా సరిపోను ఉంది. కలెక్టరేట్ విస్తరణలో కార్లు, ఇతర వాహనాలకు సంబంధించి డ్రైవింగ్ టెస్టు నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న ట్రాక్‌ను వదిలేస్తే తమకు ఇబ్బందులు ఉండవని రవాణా శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఆ ట్రాక్ స్థలాన్ని ఆర్‌టీఏ కార్యాలయానికి ఉంచాలని కోరుతున్నారు. కావాలంటే ట్రాక్ పక్కనుంచి ఆర్టీఏ కార్యాలయం వరకు వెనుకవైపు ఉన్న స్థలాన్ని తీసుకోవాలని, ట్రాక్‌ను అక్కడే ఉంచాలంటున్నారు.
ఫ నల్లగొండ సమీపంలో దండెంపల్లిలో ఏర్పాటు చేయాలనే ఆలోచన
ఫ అదే జరిగితే.. లైసెన్స్ కోసం కార్యాలయానికి, టెస్టులకు దండెంపల్లి వెళ్లాల్సిందే..
ఫ వాహనదారులకు ఇబ్బందులే..
ఫ ట్రాక్ వరకు స్థలాన్ని వదిలేయాలంటున్న ఆర్‌టీఏ సిబ్బంది

డ్రైవింగ్ ట్రాక్.. తరలింపు!