నాగర్‌కర్నూల్: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిసేవి. కానీ, ఈ ఏడాది పరిస్థితి అంతా తారుమారైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. సాధారణ వర్షపాతం పక్కన పెడితే జిల్లాలో 31.23 శాతం లోటు నమోదైంది. ఈ ప్రభావం భూగర్భ జలాలపై తీవ్రంగా పడింది. 7.04 మీటర్ల లోతుకు జలమట్టం పడిపోయింది. మరోవైపు వానాకాలంలోనే ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఫలితంగా ఇటు వర్షాలు లేక.. అటు బోరు, బావుల్లో నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో సాధారణంగా 477.1 మి.మీ., వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 328.1 మి.మీ., మాత్రమే కురిసి.. ఏకంగా 31.23 శాతం లోటు ఏర్పడింది. జూన్‌లో 22 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ.. జూలైలో 37, ఆగస్టులో 53, సెప్టెంబర్‌లో 39 శాతం లోటు నమోదైంది. దీంతో వర్షాకాలం ముగిసే నాటికి భూగర్భజలాలపై ఆ ప్రభావం కనిపించింది.
వెల్దండ మండలంలోని చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన రైతు శశిధర్‌రెడ్డి తనకున్న మూడు బోర్లతోపాటు కేఎల్‌ఐ కాల్వ నీటి ఆధారంగా 5 ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. అయితే కేఎల్‌ఐ కాల్వలో ఇప్పటికీ చుక్క నీరు రాకపోగా.. లోటు వర్షపాతం ప్రభావంతో బోరుబావుల్లో జలాలు ఇంకిపోయాయి. ఫలితంగా మూడు బోర్లు సన్నటి ధారలా నీరు వస్తున్నాయి. దీనికితోడు కరెంట్ కోతలతో పారిన పొలమే మళ్లీ మళ్లీ పారుతోంది. ప్రస్తుతం వరిపంట పొట్ట దశలో ఉండగా.. చివరికి పంట చేతికొస్తుందో.. లేదోనని రైతు ఆందోళన చెందుతున్నాడు.
వానాకాలం నాలుగు నెలల్లో కురిసిన
వర్షపాతం ఇలా (మి.మీ.,)..
నెల సాధారణం కురిసింది లోటు అధికం
జూన్ 84.9 103.7 – 22
జూలై 116.7 73.9 37 –
ఆగస్టు 130.9 62.0 53 –
సెప్టెంబర్ 144.6 88.5 39 –
ఆగస్టులో భూగర్భ జలమట్టం 7.17 మీ.,
వర్షపాతం లోటు 31.23 శాతం
సెప్టెంబర్‌లో భూగర్భ జలమట్టం 7.04 మీ.,
కోడేరులో అత్యల్పంగా
1.16 మీ.,
నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా నీటి లోతు 11.62 మీ.,
ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఉంటుందని వాతావరణ నిపుణలు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజుల నుంచి తీవ్రమైన ఎండలు.. ఉక్కపోత ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వ్యవసాయ పొలంలో పనిచేసే కూలీలు సైతం ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే పరిస్థితి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఉంటే ఎలా అని అందరిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పత్తి పంట వర్షాభావంతో దిగుబడి గణనీయంగా తగ్గనుంది. దీపావళి దాటిన తర్వాత పత్తి పంట పూర్తి కావొచ్చు. ఇక భూగర్భజలాలు, కరెంట్ కోతలతో వరి పంటకు నీరుపారడం కష్టంగా మారింది. కొన్నిచోట్ల ఎండిపోతున్నాయి. పంట చేతికి రావడానికి మరో రెండు నెలలు పడుతుంది. అదేవిధంగా వేరుశనగ పంట సైతం బాగేనా సాగు చేశారు. నాలుగు నెలల పంట కాగా.. పరిస్థితి చూస్తే పంటలు చేతికి వచ్చేనా లేదా అన్న అనుమానం రైతుల్లో నెలకొంది. పంటలు చేతికి రాకపోతే రైతన్న ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రభావం అన్నిరంగాలపై పడనుంది. ఈశాన్య రుతుపవనాలు తిరుగు సమయంలో లేక తుపాన్ ఏర్పడి వర్షాలు కురిస్తే తప్ప వచ్చే ఏడాది జూన్ వరకు వర్షాలు ఉండే పరిస్థితి లేదు. అ ప్పటి వరకు భూగర్భజలాలు గణనీయంగా లోతుకు పడిపోతాయని భూగర్భజల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి వానాకాలంలో 31 శాతం లోటు వర్షపాతం
జిల్లాలో సగటున 7.04 మీటర్ల లోతుకు భూగర్భజలాలు
అత్యధికంగా నాగర్‌కర్నూల్‌లో 11.62 మీటర్ల కిందకి..
వర్షాలు తగ్గడంతో జలవనరులపై పెరుగుతున్న ఒత్తిడి
పొట్ట దశలో వరిపంట.. ఆందోళనలో రైతులు


