కందనూలు: జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లలో ఉన్న ఇన్నోవా వాహనాలను ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల కండిషన్ల గురించి డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా మరమ్మతుకు గురైతే వెంటనే సరి చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి డ్రైవర్‌కు నెలకి ఒకసారి మెడికల్ కండిషన్‌తోపాటు కంటి పరీక్ష చేయించాలని పోలీస్ ట్రాన్స్‌పోర్టు అధికారి రాఘవరావుకు సూచించారు. ఎవరైనా డ్రైవర్లు అనారోగ్యంగా ఉంటే వారిని తప్పించి కొత్త డ్రైవర్లకు ట్రైనింగ్ ఇచ్చి నియమించుకోవాలని, వాహనాలను జాగ్రత్తగా చూసుకొని ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలని ఆదేశించారు.
పశువైద్య శిబిరాలను వినియోగించుకోండి
తాడూరు: రగామీణ ప్రాంతాల్లో పశుసంపదను పెంపొందించేందుకు పశువైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు సంతానోత్పత్తి శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జ్ఞానశేఖర్ అన్నారు. మంగళవారం మండలంలోని యతాత్మపూర్‌లో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుసంతానోత్పత్తి శిబిరం ఏర్పాటు చేసి పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిబిరాల ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు. పశువులలో వంధత్వ నివారణ కోసం క్రమం తప్పకుండా శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. శిబిరాలలో వ్యాధి నిరోధక, గర్భకోశ పరీక్షలు నిర్వహించి దూడలకు నట్టల నివారణ మందులు డైవార్మింగ్ వంటివి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వీబీ జీ రాంజీ పథకం ద్వారా నిర్మించే పశువుల పాకల ప్రాముఖ్యత, కిసాన్ క్రెడిట్ రైతులకు అందించే తక్కువ వడ్డీ రుణాల గురించి వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ మాధవిరెడ్డి, ఉపసర్పంచ్ భాస్కర్, పశుసంవర్ధకశాఖ గోపాలమిత్రలు, రైతులు పాల్గొన్నారు.
వీరభద్ర.. మంగళం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలోని క్షేత్రపాలకుడు శ్రీ వీరభద్రస్వామి అగ్నిగుండం కార్యక్రమం మంగళవారం తెల్లవారుజామున వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సంకీర్తనలు ఆలపిస్తూ నందికోళ్లు, ఖడ్గాలు ప్రదర్శించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని దేవస్థానం నుంచి కోనేరు వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సన్నాయి వాయిద్యాల మధ్య మంగళహారతులతో ఊరేగింపుగా అగ్నిగుండం వద్దకు తీసుకొచ్చారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి తడిబట్టలతో అగ్నిగుండం వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం కణకణమండే అగ్నిగుండంపై నడిచి భక్తిని చాటుకున్నారు. అనంతరం మహామంగళహారతి, గురుస్వాములకు ప్రత్యేక హారతి నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, అర్చనలు చేసి, శ్రీ ఈశ్వర వీరప్పయ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఉత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.


