అచ్చంపేట: బతుకమ్మ పండుగకు చీరలొచ్చాయ్. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కాచెల్లెళ్లకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. మహిళలకు చిలుక పచ్చ రంగులో మెరిసిపోయే చీరలు అందించనున్నారు. పండుగ మరో 15 రోజులు ఉండగానే ముందుస్తుగా జిల్లాకు ఇప్పటికే సగం చీరలు రాగా.. మిగతావి త్వరలోనే వస్తాయని అధికారులు చెబుతున్నారు. సద్దుల బతుకమ్మ రెండ్రోజుల ముందుగానే పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. అతివలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ ఎంగలి పూల నాటి నుంచి మహిళలు చేసే సందడి కనులవిందే. ఉదయం వేళలో పూలు తేవడం.. బొడ్డెమ్మలను పేర్చడం.. సాయంత్రం వేళలో పాటల కోలాహలంతో బతుకమ్మను కీర్తించడం ప్రతీతి. జిల్లాలోని లోగిళ్లలో చిన్నారుల నుంచి మహిళా వృద్ధుల వరకు పండుగ వాతావరణం నెలకొంటుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం నుంచి బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆడపడుచులకు పండుగ కానుకగా చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో రేషన్ కార్డులో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పథకాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 2.40 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. గతేడాది పాలపిట్ట రంగులో ఒకే డిజైన్‌లో పంపిణీ చేయగా.. ఈసారి చిలకపచ్చ రంగు కలిగినవి ఇవ్వనున్నారు. సిరిసిల్ల నేత కార్మికులు వాటిని తయా రు చేశారు. ఈ నెల 20న దసరా సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 11 నుంచి ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభం కానుండగా.. వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు.
మహిళలకు దసరా పండుగ కానుకగా అందజేత
ఇప్పటికే జిల్లాకు చేరిన 92,106 చీరలు
త్వరలో రానున్న మరో 1.48 లక్షలు
సద్దుల బతుకమ్మకు ముందే పంపిణీ చేసేలా ఏర్పాట్లు
గోదాంలలో నిల్వ..
బతుకమ్మ చీరలను అక్టోబరు మొదటి వారంలోగా సరఫరా చేసి పండుగకు రెండు, మూడు రోజుల ముందు పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అనుకున్న దానికి వారం రోజుల ముందుగానే జిల్లాకు 92,106 చీరలు చేర్చా రు. వీటిని జిల్లాకేంద్రంతోపాటు అచ్చంపేటలోని గోదాంలలో భద్రపర్చారు. మిగిలిన చీరలు జిల్లాకు చేరిన తర్వాత ఆయా గోదాంల నుంచి మండల సమైక్యలకు అందించనున్నారు. అక్కడి నుంచి గ్రామస్థాయిలో ఉండే వీఓఏలకు ద్వారా మహిళలందరికీ పంపిణీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం సద్దుల బతుకమ్మకు రెండు, మూడు రోజుల ముందే పూర్తయ్యేలా జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
ఆధార్, రేషన్ ఆధారంగా..
ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన 92,106 చీరలను గోదాంలలో భద్రపర్చాం. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ బతుకమ్మ చీరలు అందిస్తారు. ఈ నెల 10 తర్వాత మండల కేంద్రాలకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. తొలుత స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించాక.. మిగిలిన వారికి ఆధార్, రేషన్‌కార్డు ఆధారంగా పంపిణీ చేస్తారు. – చిన్న ఓబులేసు, డీఆర్‌డీఓ


