జిల్లాలో 10 మండలాలు ఎంపిక..
జిల్లాలో వేరుశనగ పంటసాగు విస్తీర్ణం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విత్తనాల పంపిణీకి జిల్లా వ్యవసాయశాఖ ఎక్కువగా వేరుశనగ పండించే 10 మండలాలను ఎంపిక చేసింది. గతేడాది అచ్చంపేట, లింగాల, ఉప్పునుంతల, బల్మూర్, వంగూరు, కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాలు ఎంపికయ్యాయి. ఆయా మండలాల్లో 14,164 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 12,812 మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ ఏడాది కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో వేరుశనగ సాగు అంతంత మాత్రమేనని గుర్తించి తొలగించారు. వాటి స్థానంలో అమ్రాబాద్ మండలాన్ని చేర్చారు. ఈ ఏడాది మొత్తంగా 10 మండలాలను ఎంపిక చేయగా.. లేపాక్షి, గిర్–4, గిర్–5 రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్: కేంద్ర ప్రభుత్వం నూనె గింజల సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంచాలనే లక్ష్యంతో జాతీయ వంట నూనెలు – నూనె గింజల మిషన్ (ఎన్‌ఎంఈఓ) నెలకొల్పింది. ఈ పథకం కింద రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి, నూనె గింజలు ఉత్పత్తిచేసే పంటల సాగును ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా గతేడాది నుంచి వేరుశనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు ఇతరత్రా నూనె గింజల పంపిణీకి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. జిల్లాకు కేవలం వేరుశనగ విత్తనాల కోసమే రూ.16.14 కోట్లకు పైగా కేటాయించగా.. 14,164 క్వింటాళ్ల విత్తనాలను ఎంపిక చేసిన రైతులకు యాసంగి సీజన్‌లో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ఏడాది సైతం రూ. 15కోట్ల నిధులు కేటాయించగా.. 11,800 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు వచ్చాయి.
ఆరేళ్ల పాటు కొనసాగింపు..
రాష్ట్రంలోనే వేరుశనగను అధికంగా సాగుచేసే జిల్లాగా నాగర్‌కర్నూల్ పేరొందింది. దీంతో ఈ పథకానికి కేంద్రం జిల్లాను ఎంపిక చేసింది. ఆరేళ్ల పాటు పథకం అమలులో ఉండనుంది. 2025–26 నుంచి ప్రారంభించగా.. 2030–31 వరకు కొనసాగనుంది. ఏటా ఎంపిక చేసిన మండలాల్లో రైతులకు అర ఎకరం నుంచి రెండున్నర ఎకరాల సాగుకు అవసరమైన విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తూ వస్తున్నారు. తద్వారా రైతులపై విత్తన కొనుగోలు భారం తప్పుతోంది. ఎకరానికి ఒక క్వింటా వేరుశనగ ఇవ్వగా.. వాటిని విత్తనాలుగా మార్చాల్సి వస్తుంది. ఆ రైతుకు ఉన్న పొలంలో సాగుచేసి, పండించిన పంటను విక్రయించుకోవాలి. నూనె సైతం తయారు చేసుకోవచ్చు.
నూనె గింజల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ఎన్‌ఎంఈఓ ద్వారా రైతులకు ఉచితంగా విత్తనాలు
2025–26లో జిల్లాకు రూ. 16.14కోట్లు కేటాయింపు
12,812మంది రైతులకు 14,164 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ
2026–27లో 11,800 క్వింటాళ్ల విత్తనాల పంపిణీకి రూ.15కోట్లు మంజూరు


