కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 14 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో 7 భూ తగాదాలపై, మరో 7 తగు న్యాయం కోసం ఫిర్యాదులు అందగా.. పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ తెలిపారు.
ఆర్టీఐ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దు : కలెక్టర్
కందనూలు: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి.. నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయంతో కలిసి ఆర్టీఐ, ఎఫ్‌ఆర్‌ఎస్, ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది హాజరు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టీఐ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. నిబంధనల మేరకు దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులను ప్రత్యేకంగా గుర్తించి.. వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రజలకు సమాచారం అందించే విషయంలో పారదర్శకతతో విధులు నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వెలుపల ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా సమాచారం అందించే అధికారి వివరాలతో పాటు సంబంధిత అధికారి ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. విధులకు సకాలంలో హాజరై ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా శాఖాధిపతులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయాలి
కందనూలు: నియోజకవర్గంలో ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన విసృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో పట్టభద్రులను గుర్తించి.. ఓటరుగా నమోదు చేయించేందుకు కృషి చేయాలన్నారు. ప్రధానంగా పార్టీ సానుభూతిపరుల ఓట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ప్రతి గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ గ్రాడ్యుయేట్ ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు. కాగా, నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లికి చెందిన పార్టీ నాయకుడు రామచంద్రుడు ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా.. కుటుంబ సభ్యులను మర్రి జనార్దన్‌రెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నేడు కలెక్టరేట్ వద్ద వామపక్షాల ధర్నా
కందనూలు: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ గుప్తాను తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో 13 కోట్ల మంది పౌరుల ఓట్లను అక్రమంగా తొలగించిన జ్ఞానేశ్‌కుమార్ గుప్తాను తక్షణమే తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పదవిలో ఉన్న వ్యక్తి హుందాతనంగా వ్యవహరించడంలో ఘోరంగా విఫలమవుతున్నారని విమర్శించారు. ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఆనంద్‌జీ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అశోక్ ఉన్నారు.


