గద్వాల: కృష్ణా బేసిన్‌లో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాలకు ఎగువ నుంచి వరద తాకిడి ఎట్టకేలకు మొదలైంది. కృష్ణమ్మ పరవళ్లను చూసిన అన్నదాతల్లో రేకెత్తిన ఆశలు.. ఎక్కువసేపు నిలవలేదు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నిరాశగా మారాయి. ఎగువ ప్రాంతంలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి తగ్గింది. ఆదివారం రాత్రి 33వేల క్యూసెక్కుల వరద రాగా.. సోమవారానికి 27వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో వచ్చిన వరద నీటిని జూరాల జలాశయం ఎఫ్‌ఆర్‌ఎల్ 3,018 మీటర్ల వరకు నింపి.. తాగునీటి అవసరాలకు వినియోగించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరద జలాలతో వానాకాలంలో పంటలు సాగుచేసుకోవచ్చని ఆశపడిన రైతన్నలకు నిరాశే ఎదురైంది.
అగమ్యగోచరంగా ఆయకట్టు సాగు..
వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎల్‌నిన్ ప్రభావంతో వరుణుడు మోహం చాటేశాడు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సరైనా వర్షాలు లేక పంట పొలాలు బీడుపడ్డాయి. జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో కూడా అదే పరిస్థితి నెలకొంది. గతేడాది మే నెలలోనే వరద జలాలు జూరాలకు చేరగా.. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వర్షాకాలంలో జూరాల జలాశయం అడుగంటిందంటే.. పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని 69వేల ఎకరాలు, కుడి కాల్వ పరిధిలోని 37,400 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.
ఆరుతడి పంటల వైపు..
రాష్ట్రంలో తలెత్తిన ఎల్‌నినో పరిస్థితులను గుర్తించిన అధికారులు.. వానాకాలంలో తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలు సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలైన మినుములు, పెసలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. అయితే జూరాల ఆయకట్టులో చాలా వరకు వరిసాగు తప్ప.. ఇతర పంటలను సాగుచేయడానికి రైతులు మొగ్గు చూపడం లేదు.
80వేల ఎకరాల్లో నారుమళ్లు..
ఏటా వానాకాలంలో జూరాల ఆయకట్టు రైతులు వరిసాగు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఏర్పడ్డాయి. అయితే రైతులు మాత్రం వరుణ దేవుడు కరుణించకపోతాడా అన్న భరోసాతో యథావిధిగానే వరిపంట సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఎడమ, కుడి కాల్వల పరిధిలో సుమారు 80వేల ఎకరాలకు పైగా నారుమళ్లు పోసుకున్నారు. అయితే మూడు రోజులుగా జూరాలకు వరద వచ్చి చేరుతుండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే రెండు రోజులకే వరద తగ్గిపోవడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
రెండు రోజుల వ్యవధిలోనే జూరాలకు తగ్గిన వరద
వరద జలాల్లో తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం
ప్రశ్నార్థకంగా 1.9లక్షల ఆయకట్టు సాగు
ఆందోళనలో అన్నదాతలు


