కందనూలు: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఉదయం నుంచి క్యూ కట్టారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. మొత్తం 54 అర్జీలు అందగా.. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మాత్రమే కాదని.. ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపే బాధ్యతాయుతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. అధికారులు ప్రతి ఫి ర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా నిర్లక్ష్యానికి గురికాకుండా సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిన్నయ్య, దేవసహాయం, డీఆర్వో పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.


