ఆ ఒక్కటే అడ్డంకి.. | - | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కటే అడ్డంకి..

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

జీజీహెచ్‌పై భారం..

వినియోగదారుల ఫోరం తరలిస్తేనే..

‘సూపర్‌’ సేవలకు ‘ఫోరం’ విఘాతం

2016లో అడుగులు.. 2023లో పనులు..

మహబూబ్‌నగర్‌లోని ఎదిరలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ఆర్టీసీ బస్‌స్టాండ్‌ ఎదుట ఉన్న పాత కలెక్టరేట్‌ స్థానంలో 1,000 పడకల సామర్థ్యంతో ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2016లో మొత్తం రూ.450 కోట్లతో గత బీఆర్‌ఎస్‌ హయాంలో అడుగులు పడ్డాయి. ఇందులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.270 కోట్లు కేటాయించారు. 2022 డిసెంబర్‌లో ఈ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాత కలెక్టరేట్‌లోని సామగ్రిని కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ కలెక్టర్‌ కార్యాలయ సముదాయంలోకి మార్చేందుకు రెండున్నర నెలల సమయం పట్టింది. 2023లో ఆస్పత్రి భవన నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి.

4 బ్లాక్‌లు పూర్తి.. ఈ–బ్లాక్‌ పనులు షురూ..

వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏ, బీ, సీ, డీ, ఈ బ్లాక్‌లుగా విభజించి బీఆర్‌ఎస్‌ హయాంలోనే నిర్మాణం ప్రారంభించారు. తొలి నాలుగు బ్లాక్‌ల (ఏ, బీ, సీ, డీ) నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. ఈ–బ్లాక్‌ నిర్మించాల్సిన స్థలంలో ఈవీఎంల గోదాం ఉండగా.. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో పడింది. మూడు నెలల కిత్రం కోర్టు ఆదేశాలతో ఈవీఎంలను కొత్త కలెక్టరేట్‌కు తరలించడంతో సమస్య పరిష్కారం కాగా.. ఈ–బ్లాక్‌ పనులు ప్రారంభమయ్యాయి.

చివరి దశలో పరికరాల బిగింపు..

మహబూబ్‌నగర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో భాగంగా హైదరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి తరహాలో అధునాతన హాస్పిటల్‌ థియేటర్లు(ఎంఓటీ) ఐదు, ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ వర్క్స్‌, ఫైర్‌ ఫైటింగ్‌ ట్యాంక్‌లు, పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టం, పవర్‌, పవర్‌ బ్యాక్‌ అప్‌ సిస్టం, నాలుగు బ్లాక్‌లలో డొమెస్టిక్‌ పంప్‌లు, అంబులెన్స్‌ గ్యారేజీతో పాటు మెడికల్‌ గ్యాస్‌ పైప్‌లైన్లు, భారీ సామర్థ్యం గల రెండు వాటర్‌ ట్యాంక్‌లు, తొమ్మిది లిఫ్ట్‌లు, తొమ్మిది కౌంటర్లు, కేథల్యాబ్స్‌, ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌కు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేశారు. ఇంటర్నల్‌ రోడ్లు, స్ట్రీట్‌ లైట్లు. ఆస్పత్రి చుట్టూ ప్రహరీ పనులు సైతం పూర్తయ్యాయి. అదేవిధంగా గుండె, మూత్రపిండాలు, కంటి, న్యూరో, ఆర్థో, ఈఎన్‌టీ వంటి మొత్తం 35 వైద్య విభాగాలకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల వ్యయంతో అధునాతన వైద్యసేవలందించేలా వైద్య పరికరాలు అమర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ–బ్లాక్‌ అయితేనే వైద్య పరికరాల బిగింపు..

ఈవీఎంల సమస్య తీరడంతో ఆలస్యంగా ప్రారంభించిన ఈ–బ్లాక్‌లో మొత్తం ఐదు స్లాబ్‌లు నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం రెండు అంతస్తుల స్లాబ్‌ వరకు నిర్మాణం పూర్తయింది. ఈ భవన నిర్మాణ పనులు పూర్తయితే అధునాతన వైద్య పరికరాలను అన్ని బ్లాక్‌లలో అమర్చనున్నారు. ఆక్సిజన్‌, ఫైర్‌ ఫైటింగ్‌ వంటివి అనుసంధానంగా ఏర్పాటు చేయాల్సి రావడంతో ఆయా పనులను ఒకేసారి చేయాల్సి వస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు.

ఉమ్మడి పాలమూరులో పేద రోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలందించాలనే లక్ష్యంతో మహబూబ్‌నగర్‌లో చేపట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఈవీఎంల గోడౌన్‌ సమస్య పరిష్కారమై పనులు తుది దశకు చేరుకున్నా.. వినియోగదారుల ఫోరం కేంద్రం తరలింపుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వాహనాల పార్కింగ్‌ పనులు ఇంకా మొదలు కాలేదు. ఫలితంగా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత కాలం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘అధికార’ యంత్రాంగంలో కొరవడిన చిత్తశుద్ధి, ప్రణాళిక లేమి, పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ఫోకస్‌..

– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

కొనసాగుతున్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఈ–బ్లాక్‌ నిర్మాణ పనులు

జిల్లాకేంద్రంలోని 650 పడకల సామర్థ్యం గల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో 165 మంది వైద్యులు ఉన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులు ఉన్నాయి. అయినా.. ఆయా జిల్లాల నుంచి ఎక్కువ శాతం మంది రోగులు మహబూబ్‌నగర్‌లోని జీజీహెచ్‌కే వస్తున్నారు. ఈ ఆస్పత్రిలో రోజుకు సగటున 1,800 నుంచి 2,000 వరకు ఓపీ ఉంటోంది. వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే జీజీహెచ్‌పై భారం తగ్గనుండగా.. వైద్యుల సంఖ్య రెట్టింపు కావడంతో పాటు పేదరోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్యసేవలు అందనున్నాయి.

వినియోగదారుల కేంద్రంపై వీడని

అనిశ్చితే కారణం

స్పందిస్తే త్వరలో అందుబాటులోకి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

ఈవీఎంల గోదాం తరలింపుతో చురుగ్గా సాగుతున్న ఈ–బ్లాక్‌ పనులు

అత్యాధునిక వైద్యం కోసం నాలుగేళ్లుగా పేద రోగుల ఎదురుచూపులు

ఈవీఎంల అడ్డంకి తొలగినా.. వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలో ఉన్న వినియోగదారుల ఫోరం కేంద్రంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దీన్ని న్యూటౌన్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఎదుట ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి మార్చాలని అధికారులు ప్రతిపాదించారు. ఆ తర్వాత మరి కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాలను సైతం పరిశీలించారు. కానీ.. ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడం.. వినియోగదారుల ఫోరం కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగుతుండడంతో ఇంటర్నల్‌ రోడ్లు, స్ట్రీట్‌ లైన్ల ఏర్పాటు పూర్తయినా.. వాహనాల పార్కింగ్‌ పనులు ప్రారంభం కాలేదు. దీన్ని తరలిస్తే ఒక వైపు ఈ బ్లాక్‌.. మరోవైపు చివరి దశలో ఉన్న వైద్య పరికరాల బిగింపుతో పాటు వాహనాల పార్కింగ్‌ పనులు పూర్తి చేయనున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తేనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు పేద రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఆస్పత్రిని పలు పర్యాయాలు పరిశీలించారు. ఈ నెల మొదటి వారంలో ఆస్పత్రిని సందర్శించిన క్రమంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ లోపు పనుల పూర్తి గగనమేనని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement