రైతులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

రైతులకు అండగా ఉంటాం

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

మిల్లులకు ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం వహించొద్దు

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి జిల్లాకేంద్రంలోని సత్యసాయి రైస్‌మిల్లుతో పాటు చందుబట్ల వెంకటేశ్వర్లు ఆగ్రో ఇండస్ట్రీస్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లుల వద్ద వరిధాన్యం వాహనాలు భారీగా నిలిచిపోవడాన్ని గమనించిన మంత్రి.. మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో అన్‌లోడ్‌ చేయకుండా ఆలస్యం చేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోతుండగా.. రైస్‌మిల్లుల వద్ద సమన్వయం లేక సమస్య తీవ్రతరం అవుతుందన్నారు. అనంతరం అధికారులతో మంత్రి సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే గోదాంల వద్ద పోలీ సు నిఘా ఏర్పాటుచేసి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, డీఎస్పీ శ్రీనివాసులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement