● హైదరాబాద్–శ్రీశైలం రహదారిపై విరిగిపడిన చెట్లు
● వాహనాల రాకపోకలకు
అంతరాయం
కల్వకుర్తి: జిల్లాలోని కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి వెల్దండ పోలీస్‌స్టేషన్ సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటపాటు శ్రమించి రోడ్డుకు అడ్డుగా పడిన చెట్లను గ్రామస్తులు తొలగించారు. అదే విధంగా వెల్దండ బస్టాండ్‌లో చెట్లు విరిగిపడ్డాయి. 13వ వార్డులో విద్యుత్ స్తంభం విరిగి ఓ ఇంటిపై పడటంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. బీసీ వసతిగృహంలోని భారీ వృక్షాలు విరిగి విద్యుత్ వైర్లపై పడటంతో తెగిపోయాయి. సింగల్‌విండో కార్యాలయానికి మొక్కజొన్నల లోడ్‌తో వచ్చిన ట్రాక్టర్లపై చెట్టు విరిగిపడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రంలో దాదాపు 100 బస్తాల మొక్కజొన్న తడిసిపోయింది. చెర్కూర్‌లోనూ విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వెల్దండ శివారులో 33కేవీ లైన్ స్తంభాలు విరిగిపోవడంతో బొల్లంపల్లి, భైరాపూర్ సబ్‌స్టేషన్లకు సరఫరా నిలిచిపోయింది. కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో మల్లేష్ అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న వేప చెట్టు, విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగి పడటంతో అక్కడ నిలిపి ఉంచిన రెండు ట్రాక్టర్లు దెబ్బతిన్నాయి. ఘటన సమయంలో అక్కడ ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్, మున్సిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చెట్టు తొలగింపు పనులు చేపట్టారు.


