రేపు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

రేపు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

కందనూలు: నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కీలక సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హేమంతకేశవ్‌ పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పాడి పరిశ్రమ, క్రీడలు, యువజనశాఖల మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డా.మల్లు రవి, ఎమ్మెల్సీలతో పాటు నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పనుల పురోగతి, భూసేకరణ సమస్యలు, పెండింగ్‌ పనులు, పునరావాసం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

‘రాజీవ్‌ యువవికాసం’పై నిర్లక్ష్యం తగదు

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివశంకర్‌, మధు అన్నారు. ఆదివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజీవ్‌ యువవికాసం పథకం ద్వారా యువతకు రాయితీపై రుణాలు అందిస్తామని చెప్పి.. కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిరుద్యోగ యువతను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. జూన్‌ 2న రాజీవ వికాసం లబ్ధిదారులను ప్రకంటించకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అందులో భాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో మండలకేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్మయ్య, సహాయ కార్యదర్శి బాలునాయక్‌, భీముడు, మహేశ్‌, శివరాం ఉన్నారు.

హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

చారకొండ: హిందూ ధర్మ విశిష్టతను ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరముందని ఆధ్యాత్మికవేత్త రాధామోహన్‌దాస్‌ స్వామిజీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం చారకొండలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయనతో పాటు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. హిందువులంతా సంఘటితమై హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ధర్మాన్ని కాపాడే పౌరులుగా కంకణబద్దులు కావాలన్నారు. అనంతరం నిర్వహించిన కళాదార్మిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. హిందూ సమ్మేళనం మండల ఇన్‌చార్జి రవిచారి, గిరిజనమోర్చా జిల్లా అధ్యక్షుడు రవి నాయక్‌, బీజేపీ మండల అధ్యక్షుడు చలమోని కృష్ణ, దుర్గాప్రసాద్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, లక్ష్మణ్‌ శర్మ, ప్రశాంత్‌ శర్మ, వేణుగోపాల్‌ శర్మ పాల్గొన్నారు.

28,681 బస్తాల

ధాన్యం రాక

నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు ఆదివారం 28,681 బస్తాల ధాన్యం వచ్చింది. ఇందులో 25,481 బస్తాల ఆర్‌ఎన్‌ఆర్‌ రాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,853, కనిష్టంగా రూ.2,773 ధర లభించింది. 3 వేల బస్తాల 1010 రకం రాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.1,860, కనిష్టంగా రూ.1,741 ధర లభించిందని మార్కెట్‌ కార్యదర్శి రమేష్‌ తెలిపారు.

నేటి నుంచి డీఎడ్‌ పరీక్షలు

వనపర్తిటౌన్‌: జిల్లాలో డీఎడ్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు సోమవారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్‌ ఘనీ, ఏసీజీఈ గణేష్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 8:30 గంటల వరకు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement