● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
కందనూలు: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ఆదివారం ధాన్యం కొనుగోళ్లపై ఖమ్మం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, హైదరాబాద్ పౌరసరఫరాల సంస్థ కార్యాలయం నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పంట అవశేషాలను పొలాల్లో కాల్చకుండా అవగాహన కల్పించాలన్నారు. ఈనెలాఖరు నాటికి ధాన్యం కొనుగోళ్లు వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వరిధాన్యం సేకరణ కోసం 200 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులకు ఎలా ంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పారు. అకాల వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న ధాన్యం తడిసినా.. రైతులకు నష్టం కలుగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.


