కందనూలు: సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, ప్రాజెక్టుల ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీగా భూసేకరణ వివరాలను తెలుసుకున్నారు. భూసేకరణలో జరుగుతున్న ఆలస్యానికి గల కారణాలు, రైతుల అభ్యంతరాలు, కోర్టు కేసులు, పరిహారం చెల్లింపుల స్థితి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా పనులు వేగవంతం చేయాలన్నారు. ఏ చిన్నపాటి ఆలస్యం జరిగినా మొత్తం ప్రాజెక్టు పనులపై ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ప్రతి మండల స్థాయిలో ప్రత్యేక సమన్వయ బృందాలను ఏర్పాటుచేసి.. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. రైతులతో సానుకూల చర్చల ద్వారా భూసేకరణను వేగవంతం చేయాలని, వారికి చట్టప్రకారం న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల పురోగతిని మరింత వేగవంతం చేయడానికి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వారం ప్రాజెక్టుల పురోగతి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈలు పార్థసారథి, సత్యనారాయణరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ తదితరులు ఉన్నారు.
భూభారతి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ అన్నారు. హైదరాబాద్ నుంచి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేశ్ కుమార్, రెవెన్యూశాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంత్ వీసీ నిర్వహించగా.. అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ వాల్యూ అప్‌డేషన్, భూభారతి ఐజీఆర్‌ఎస్ పోర్టల్‌లో ఫామ్ 1, 2, 3, 4లకు సంబంధించిన అప్‌డేషన్ ప్రక్రియపై సమీక్షించారు.


