జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి

May 23 2026 12:40 AM | Updated on May 23 2026 12:40 AM

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కందనూలు: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సమావేశాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. పాలమూరు ప్రాంతం ఎన్నో దశాబ్దాలుగా సాగునీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఈ ప్రాంత రైతుల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలంటే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కీలకమని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పనులు నెమ్మదించాయని, తాము దీనిని పూర్తిచేసి తీరుతామని చెప్పారు.

కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి సూచనల మేరకు జిల్లాలోని వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న సుమారు 5 వేల ఫైళ్లను రానున్న 15 రోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు.

ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు వారధిగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థికాభివృద్ధి కోసం కృషిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవసహాయం, మున్సిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement