కందనూలు: ఇసుక తవ్వకాలు, రవాణాలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జిల్లాలో ఇసుక రవాణాకు అనుమతులు జారీ చేస్తున్నామని, నిబంధనల అతిక్రమణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అవకాశం లేకుండా సంబంధిత శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త ఆస్పత్రులు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర ప్రభుత్వ రంగ నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. ప్రజలకు నిరంతరం ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాలతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, నిర్మాణ అవసరాలకు అనుగుణంగా ఏ ఇసుక రీచ్ నుంచి సరఫరా చేయాలనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘మన ఇసుక– మన వాహనం’ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వాహనాలకు మాత్రమే ఇసుక రవాణా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి
ప్రతి రాజకీయ పార్టీ బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ అన్నారు. ఓటర్ల సవరణ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) షెడ్యూల్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరంగా తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి 24 వరకు సన్నాహక కార్యక్రమాలు, బూత్‌ల మ్యాపింగ్, బీఎల్‌ఓలకు శిక్షణ ఇస్తామన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటిి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తారన్నారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని చెప్పారు. ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు, అనంతరం సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం చేపట్టి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వివరించారు. ఇంటింటి సర్వే, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన, డబుల్ ఓటర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కోరారు.


