కొల్లాపూర్ రూరల్: చారిత్రక కట్టడాల పరిరక్షణ మన అందరి బాధ్యత అని జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని సోమశిల గ్రామంలో ఉన్న పురాతన, ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి గ్రామ సమీపంలో నుంచి సోమేశ్వరాలయం వరకు హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల గ్రామానికి జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందని, గ్రామంలో పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయని, మన సంపదను కాపాడుకోవాల్సి బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. ఉపాధి హామీ కూలీలకు లలితా సోమేశ్వరాలయం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ మద్దిలేటి, పురాతన శాఖ పర్యవేక్షకుడు కుర్మయ్య, నాయకులు కాటం వెంకటస్వామి, నారాయణ, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.


