నిధులు పక్కదారి..! | - | Sakshi
Sakshi News home page

నిధులు పక్కదారి..!

May 21 2026 12:38 AM | Updated on May 21 2026 12:38 AM

జిల్లా పంచాయతీరాజ్‌ శాఖలో అక్రమాలు

వాహనాల అలవెన్సు పేరుతో నిధులు కాజేస్తున్న వైనం

మల్టీపర్పస్‌ వర్కర్ల జీతాలు సైతం బదిలీ

ఫోర్జరీ సంతకాలతో నెలల తరబడి

సాగుతున్న తతంగం

ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం

ఒత్తిడి చేస్తున్నారు..

గతంలో చేసిన పనులకు ఇప్పటికే బిల్లులు పొందారు. మళ్లీ ఇటీవల పనులు చేసినట్టు తప్పుడు బిల్లులు పెట్టి సంతకం పెట్టాలని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. పనులు చేపట్టకుండా తప్పుడు బిల్లులకు ఎలా సంతకం చేయాలి? కార్మికుల జీతాలను పక్కదారి పట్టించిన తీరుపై ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. ఇందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – గన్నోజు రామ్మోహన్‌, ఉపసర్పంచ్‌, మారేడుమాన్‌దిన్నె, పెద్దకొత్తపల్లి మండలం

సమగ్ర విచారణ చేపడతాం..

జిల్లాలో పంచాయతీల నిధులు, ఖాతాలపై పకడ్బందీగా పర్యవేక్షణ చేపడుతున్నాం. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే విచారణ చేస్తున్నాం. మాకు అందిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీరాములు, డీపీఓ

గ్రామ పంచాయతీ

కార్యాలయం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లా పంచాయతీరాజ్‌ శాఖలో గుట్టుగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీ నిధులను ఆయా గ్రామాల అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించాల్సి ఉండగా.. కొందరు పక్కదారి పట్టిస్తూ, అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు. నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు ఉదాసీనత వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్నిసార్లు అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్నా స్పందించడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు.

కార్మికుల జీతాలనూ వదలని వైనం..

జిల్లాలో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల కక్కుర్తికి అడ్డుకట్ట పడటం లేదు. ఈ క్రమంలో వారు సఫాయి కార్మికుల జీతభత్యాలను సైతం కాజేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్‌దిన్నెలో సఫాయి కార్మికుల జీతాలు ఇవ్వకుండా.. ప్రైవేటు ఖాతాకు మళ్లించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కార్మికుల సంతకాలను ఫోర్జరీ చేసి, 2024 ఏప్రిల్‌ 20న రూ. 5వేలు, ఆగస్టు 19న రూ. 66వేలు, 2025 జూలై 11న రూ. 85,500 చొప్పున పంచాయతీ నిధులు ఓ ప్రైవేటు ఖాతాలోకి మళ్లించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, సొమ్ము రికవరీ చేయాలని బాధితులు కలెక్టరేట్‌ను ఆశ్రయించారు.

సొంత ఖాతాల్లోకి..

గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నర్సరీలు, వైకుంఠధామాలు, వనమహోత్సవం, పల్లెప్రగతి తదితర పనుల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే బాధ్యతలను ప్రభుత్వం మండల పంచాయతీ అధికారులకు అప్పగించింది. ఇందుకోసం వినియోగించే వాహనాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో.. ఆయా జీపీల నిధుల నుంచి నెలకు రూ. 20వేల చొప్పున వాహన అలవెన్సు తీసుకునే వెసులుబాటును గతంలో కల్పించింది. అయితే కేవలం ఆరు నెలలపాటే కొనసాగించిన ఈ వెసులుబాటును ఆ తర్వాత రద్దు చేశారు. అయినప్పటికీ ఉన్నతాధికారుల కళ్లుగప్పి మరో ఏడాదిపాటు వాహనాల అలవెన్సు పేరుతో ఆయా గ్రామాల నిధులను వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేసుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. జీపీ నిధుల నుంచి ఆయా గ్రామాల మల్టీపర్పస్‌ వర్కర్ల ఖాతాల్లోకి జీతాలను బదిలీ చేయాల్సి ఉండగా.. వారితో పాటు అదనంగా మండలస్థాయి పంచాయతీ అధికారి తన వ్యక్తిగత ఖాతాలోకి జీతాలను మళ్లించడం ఈ శాఖలో కొనసాగుతున్న అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement