పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు | - | Sakshi
Sakshi News home page

పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు

May 21 2026 12:20 AM | Updated on May 21 2026 12:20 AM

కందనూలు: జిల్లాలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు కోర్‌ ప్రాంత గ్రామాల పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. బుధవారం డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్రతో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామ పరిధిలో ప్రతిపాదించిన పునరావాస కేంద్రాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రహదారులు, తాగునీటి వసతి, విద్యాసంస్థలు, ఆరోగ్య సేవలు, పరిశుభ్రత వంటి సదుపాయాలు సమగ్రంగా అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కుటుంబాలకు గృహ నిర్మాణ స్థలాలు కేటాయించడంతో పాటు, పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు. రాబోయే 30 రోజుల్లోగా లబ్ధిదారుల పేర్లపై భూ పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

● ఉపాధి హామీ పనులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ హేంమత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. ఉపాధి హామీ పథకం, చేయూత పథకం అమలుపై హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌, కమిషనర్‌ దివ్య రంగరాజన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌, దేవసహాయంతో కలిసి కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు సమర్థవంతంగా, క్రమబద్ధంగా కొనసాగుతున్నాయన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనులు రోజూ ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పని ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. వీసీలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

30 రోజుల్లోగా లబ్ధిదారుల పేర్లపై భూ పట్టాల పంపిణీ

కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

Advertisement
 
Advertisement
Advertisement