తాగునీటి కొరత లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కొరత లేకుండా చర్యలు

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

డిండి రిజర్వాయర్‌ నుంచి నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలి

కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

కందనూలు: జిల్లాలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పైప్‌లైన్‌ లీకేజీలు, మోటార్ల పనితీరు, నిల్వ ట్యాంకుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో వెంటనే మరమ్మతు పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. బిజినేపల్లి, కోడేరు, వెల్దండ, కొల్లాపూర్‌ మండలాల్లో నీటి కొరతను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. డిండి రిజర్వాయర్‌ నుంచి అచ్చంపేట, సర్వాయిపల్లి, కొల్లాపూర్‌, ఎల్లూరు గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ జగన్మోహన్‌రావు, మిషన్‌ భగీరథ ఈఈలు సుధాకర్‌ సింగ్‌, విజయ్‌శ్రీ ఉన్నారు.

● సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రైతులు అధికంగా యూరియా వినియోగించడం వల్ల భూసారం దెబ్బతిని, దీర్ఘకాలంలో పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. పంటల సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించి.. సమతుల్య ఎరువులు, సూక్ష్మ పోషకాలు, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. గ్రామస్థాయిలో ఏఈఓలు రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎరువుల దుకాణదారులు అనవసర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఏఓ యశ్వంత్‌రావు, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి రఘునాథ్‌రావు, మార్క్‌ఫెడ్‌ డీఎం తమీన ఉన్నారు.

పారదర్శకంగాధాన్యం కొనుగోలు..

కోడేరు: ధాన్యం కొనుగోలులో పారదర్శకత ఉండాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. కోడేరు మండలం పస్పులలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో 3,21,045 మంది రైతులు ఉండగా.. ఇప్పటివరకు 2,18,890 మంది రైతుల వివరాలు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం మిషన్‌ భగీరథ పంపుహౌజ్‌తో పాటు జనగణన సర్వేను కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్‌ సుల్తానమ్మ, ఈఈ సుధాకర్‌సింగ్‌, విజయ్‌, డీఈ మలేశ్వర్‌రావు, ఎంపీడీఓ శ్రావణ్‌కుమార్‌, తహసీల్దార్‌ జమీల్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement