కందనూలు: ఎయిడ్స్‌పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడంతో పాటు ప్రతి గర్భిణికి విధిగా హెచ్‌ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో వైద్యసిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఐసీటీసీ కేంద్రాలకు వచ్చే ప్రతి వ్యక్తికి గోప్యతతో కూడిన కౌన్సెలింగ్, ఇతర వైద్యపరీక్షలు నిర్వహించాలని సూచించారు. అదే విధంగా గర్భిణుల్లో హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులను గుర్తించిన వెంటనే మహబూబ్‌నగర్ ఏఆర్‌టీ కేంద్రానికి పంపించాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు నాణ్యమైన పరీక్షలు నిర్వహించి.. నివేదికలను సకాలంలో అందించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు హైరిస్క్ గ్రూపుల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. యువతలో ఎయిడ్స్‌పై అపోహలు తొలగించేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. సమావేశంలో దిశ మేనేజర్ రమేశ్, డీడీఎం సాయికుమార్, ఐసీటీసీ కేంద్రాల కౌన్సిలర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.
‘పాలమూరు’పై వివక్ష
కొల్లాపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కొల్లాపూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో 90 శాతం మేరకు పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందన్నారు. మిగిలిన 10 శాతం పనుల పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కొన్ని చోట్ల కాల్వల టెండర్లను రద్దు చేసిందన్నారు. ఇప్పటికే పనులు పూర్తిచేసి ఉంటే.. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లలో కనీసం 40 టీఎంసీల మేరకు నీటిని నిల్వచేసుకునే అవకాశం ఉండేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పాలమూరు బిడ్డను అని చెబుకునే సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైన తర్వాత ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షలు నిర్వహించడం శోచనీయమన్నారు. పాదయాత్రలో పాలమూరు జిల్లా ప్రజలు, రైతులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
సజావుగా ఇంటర్ సప్లిమెంటరీ
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా కొనసాగాయి. మంగళవారం జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో రసాయనశాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 2,006 మందికి గాను 1,843 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 1,887 మందికి గాను 1,755 మంది, ఒకేషనల్ విభాగంలో 119 మందికి గాను 88 మంది హాజరై పరీక్ష రాశారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 746 మందికి గాను 687 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 648 మందికి గాను 605 మంది, ఒకేషనల్ విభాగంలో 98 మందికి గాను 82 మంది హాజరై పరీక్ష రాశారు. మొదటి సంవత్సరంలో 163 మంది, ద్వితీయ సంవత్సరంలో 59 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.


