అంతా మా ఇష్టం! | - | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం!

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

అచ్చంపేట: స్థానిక మున్సిపాలిటీలో పాలకవర్గం పదవీకాలం ముగియగానే ఉద్యోగులు, సిబ్బంది అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ వార్డు అఫీసర్‌కు మేనేజర్‌ హోదా కల్పించి.. కుర్చీలో కూర్చోబెట్టడం పట్టణంలో చర్చనీయాంశమైంది. మున్సిపల్‌ కమిషనర్‌ అర్హత లేని సిబ్బందిని అందలం ఎక్కిస్తూ.. తనకు నచ్చిన వారికి ఇష్టం వచ్చిన స్థానాలు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మేనేజర్‌గా పనిచేసిన రమేశ్‌నాయక్‌ ఉద్యోగుల విధులు, బాద్యతలపై కఠినంగా ఉండటంతో.. అతడిపై ప్రజాప్రతినిధులకు లేనిపోని మాటలు చెప్పి డిప్యుటేషన్‌పై వెళ్లేలా చేశారు. దీంతో ఇక్కడ మేనేజన్‌ పోస్టు ఖాళీగా ఉంది. అయితే మేనేజర్‌ స్థాయి కలిగిన ఉద్యోగులు లేదా ఏఈ, ఎస్‌ఐ, టీపీఓలకు ఈ పోస్టుకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అదీ కూడా సీడీఎంఏ విధివిధానాలను అనుసరించి నడుచుకోవాల్సి ఉండగా.. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే వార్డు ఆఫీసర్‌ను మేనేజర్‌ చాంబర్‌లోని సీటులో కూర్చోబెట్టడం వెనుక మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కమిషనర్‌ ఒంటెద్దుపోకడతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాసులు తెచ్చి ఇచ్చే వ్యక్తులకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ.. వారిని వెనకేసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవంలో మున్సిపల్‌ కార్మికులు, సిబ్బందిపై దురుసుగా వ్యవహరించిన వార్డు ఆఫీసర్‌కు మేనేజర్‌ హోదా కల్పించడంపై కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ఈ విషయంపై కమిషనర్‌ మురళిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. వాట్సప్‌ ద్వారా మేసేజ్‌ చేసినా స్పందించలేదు.

అచ్చంపేట మున్సిపల్‌ కార్యాలయంలో

మేనేజర్‌ కుర్చీలో కూర్చున్న వార్డు ఆఫీసర్‌

మున్సిపల్‌ కార్యాలయంలో

దర్జాగా టేబుల్‌పై కాళ్లు వేసి కూర్చున్న సిబ్బంది

మున్సిపల్‌ మేనేజర్‌ హోదాలో వార్డు ఆఫీసర్‌

అచ్చంపేటలో చర్చనీయాంశంగామారిన వైనం

మున్సిపల్‌ కమిషనర్‌ తీరుపై

సర్వత్రా విమర్శలు

Advertisement
 
Advertisement
Advertisement