ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంబించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంబించాలి

Apr 7 2026 8:19 AM | Updated on Apr 7 2026 8:19 AM

వాతావరణం
ఉదయం నుంచే ఎండ ప్రభావం చూపిస్తుంది. మధ్యాహ్నం వేడిగా ఉండి ఉక్కపోత పెడుతుంది. సాయంత్రం కొంత ఆహ్లాదంగా ఉంటుంది

నాగర్‌కర్నూల్‌ క్రైం: ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంభించాలని, సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుందని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్‌ సేఫ్టీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వారం రోజులపాటు ‘హెల్త్‌ వీక్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలని కోరారు. ప్రజలు తమ రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు, ప్రొటీన్‌ పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అధిక నూనె, ఉప్పు, చక్కెర కలిగిన ఆహారాలను తగ్గించాలని, ముఖ్యంగా యువత ఫాస్ట్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండి ఇంటి వద్ద చేసుకున్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ తగినంత నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం, శారీరక వ్యాయామం వంటివి చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వైద్యాధికారులు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమంగా పనిచేసిన వారిని సత్కరించనున్నట్లు చెప్పారు. బుధవారం రక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా సురక్షిత ప్రసవాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గురువారం ఎయిడ్స్‌ నియంత్రణపై ‘రెడ్‌ రన్‌’ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ట్రాన్స్‌జెండర్‌ వర్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. శుక్ర వారం హోమియోపతి, ఆయుష్‌ దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరా లు చేపట్టాలని, శనివారం మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవికుమార్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషారాణి, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement